శ్రీశైలం టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా

శ్రీశైలం టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ఫోన్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 
 
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వివరించారు. 
 
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. టన్నెల్​లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విజయవాడ నుంచి 2, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది.
 
రాత్రికి భారత సైన్యం కూడా చేరుకుంటుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. లోపల 8 మంది బతుకున్న సమాచారం ఇప్పటి వరకు తెలియదని… మంత్రి పేర్కొన్నారు. సొరంగ ప్రమాదాల్లో దేశంలో కీలకమైన నిపుణుల సహకారంతో బాధితులను రక్షించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. 
 
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం వారికి సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిపై కూడా ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
“టీబీఎం ఆపరేటర్‌ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌ వెనుక ఉన్న 42 మంది బయటికి పంపారు. టన్నెల్‌ లోపల 8 మంది చిక్కుకున్నారు. టన్నెల్‌లో యూపీ, ఝార్ఖండ్‌ వాసులు చిక్కుకున్నారు. ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మిషన్‌ ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు. 8 మందిని ప్రాణాలతో రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయకచర్యలు క్లిష్టంగా మారాయి. నిపుణులైన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తీసుకొస్తాం” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.