ఉగాండా జైలులో అమానుషం .. భారతీయ బిలియనీర్ కుమార్తె

ఉగాండా జైలులో అమానుషం .. భారతీయ బిలియనీర్ కుమార్తె

స్విట్జర్లాండ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గడించిన భారత సంతతికి చెందిన పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్(26) ఉగాండా జైలులో అనుభవించిన అమానుష అనుభవాలను వెల్లడించింది. ఆమె 2024 అక్టోబర్‌లో ఉగాండాలో అరెస్టయ్యారు. తన తండ్రి దగ్గర పనిచేసిన మాజీ ఉద్యోగి ముఖేశ్ మెనారియాని కిడ్నాప్ చేసిందని, హత్య చేసిందని ఆమెపై నేరాలు మోపి అరెస్టు చేశారు. 

అయితే అతడు తర్వాత టాంజానియాలో బతికే ఉన్నాడని తెలిసాక విడిచిపెట్టారు. నిర్బంధంలో ఉన్నప్పుడు పోలీసులు తనపట్ల చాలా దారుణంగా వ్యవహరించారని వసుంధర ఓస్వాల్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. 

నన్ను మొదట ఐదు రోజుల కోసం నిర్బంధంలోకి తీసుకున్నారు. తర్వాత మరో రెండు వారాల పాటు జైలులోనే ఉంచారు. నా మానవ హక్కులను కాలరాచారు. నిర్భందంలో కనీసం స్నానం చేయడానికి కూడా అనుమతించలేదు. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు, అయితే లాయర్ల ద్వారా వారికి లంచం ఇచ్చి ఆహారం, నీళ్లు తెప్పించుకున్నాను’ అని ఆమె వివరించారు.

వసుంధర ఓస్వాల్‌ను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. కాగా అక్టోబర్ 1న బెయిల్ ఇచ్చారు. ఎలాంటి వారెంటు లేకుండానే తన ప్రాంగణం అంతా సోదాలు చేశారని ఆమె తెలిపారు. ‘నేను సెర్చ్ వారెంట్ ఉందా? అని అడిగినప్పుడు, మేము ఉగాండాలో ఏమైనా చేయగలం. నీవేమి యూరొప్‌లో లేవు అన్నారు’ అని ఆమె వివరించింది.

‘నా క్రిమినల్ లాయర్ అనుమతి లేకుండానే నాతో బలవంతంగా వాంగ్మూలం రాయించుకున్నారు. మాకు తగు సమయం ఇవ్వనందున మేము సివిల్ లాయర్‌నే పెట్టుకున్నాము. ఇతర నేరస్థులతో పాటు జైలు గదిలో పడేశారు. చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నాడని తెలిసినా నన్ను జైలులోనే ఉంచారు. ఎన్నో ప్రయత్నాలు చేశాకే నాకు బెయిల్ లభించింది’ అని ఆమె వివరించారు.

‘నేను నకసోంగోలా కారాగారంలో రెండు వారాలు గడిపాను. వారు కనిపించకుండా పోయారన్న మెనారియా బతికి ఉన్నాడని తెలుసుకున్నాక కూడా నన్ను జైలులోనే ఉంచారు. నాకు బెయిల్ దొరకడానికి వారం ముందు వారు అతడిని కనుగొన్నారు’ అని ఆమె తెలిపింది. 

‘వారు చాలా అమానవీయంగా వ్యవహరించారు. కేవలం డబ్బులు గుంజడానికే నన్ను జైలులో ఎక్కువ రోజులు ఉంచారు’ అని ఆమె పేర్కొంది. ఇదిలావుండగా వసుంధర ఓస్వాల్‌పై పెట్టిన కేసును 2024 డిసెంబర్ 19 కొట్టేశారు. తాను జైలు జీవితంలో పడ్డ బాధలకు న్యాయ పరిహారం కోరే విషయమై ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు.