ఢిల్లీ అసెంబ్లీలో తొలి ప్రతిపక్ష నేతగా అతిషి

ఢిల్లీ అసెంబ్లీలో తొలి ప్రతిపక్ష నేతగా అతిషి
 
ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిషి పేరు ఖరారైంది. ఢిల్లీ అసెంబ్లీలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఆమె కానున్నారు.  అదేవిధంగా దేశంలో మొదటి సారిగా ఓ అసెంబ్లీలో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉంటుండగా, మరో మహిళా ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం కూడా ప్రాధాన్యత సంతరింప చేసుకుంటుంది.
 
ఆదివారం మధ్యాహ్నం ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.  ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పార్టీ నుండి ఎన్నికైన 22 మంది ఎమ్యెల్యేలు ఈ సమవేశానికి  హాజరయ్యారు. 
 
సమావేశానంతరం ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషిని ఏకగ్రీవంగా నిర్ణయించామని, పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా ఆమె సేవలందించారని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఆప్ తన బాధ్యతలను నెరవేరుస్తుందని చెప్పారు.
 
తనను విశ్వసించినందుకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు, శాసనసభా పక్షానికి అతిషీ ధన్యవాదాలు తెలిపారు. బలమైన ప్రతిపక్షంగా  ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తామని ఆమె చెప్పారు.  ప్రజలు ఆప్‌కు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, బలమైన ప్రతిపక్షం ఎలా పనిచేస్తుందో తాము చూపిస్తామని తెలిపారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే మహిళలకు ఆర్థిక సాయం అంశాన్ని ఆమోదించి మార్చి 8న నాటికి వారి అకౌంట్లలో రూ.2,500 వేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. ఈ హామీని అమలయ్యేలా చూడం తమ బాధ్యత అని అతిషి చెప్పారు. ఎన్నికలకు ముందే తాము కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపామని, అయితే ఈ విషయమై వాళ్లు (బీజేపీ) గందరగోళం సృష్టించారని ఆమె విమర్శించారు.

కాగా, మూడు రోజులపాటు జరిగే ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. బీజేపీ నేత విజేంద్ర గుప్తాను స్పీకర్‌గా నామినేట్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అరవింద్ సింగ్ లవ్లీని ఎల్జీ నియమించారు. 25వ తేదీన గత ఆప్ ప్రభుత్వం అవినీతి, అవకతవకలపై కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన తొలి ఢిల్లీ మంత్రివర్గ సమావేశంలో తొలి సమావేశంలోనే 14 కాగ్ నివేదికలను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 12 ఏళ్ళ ఆప్ పాలనకు ముగింపు పలికారు. 48 స్థానాలు గెలుచుకొని 27 ఏళ్ళ అనంతరం బిజెపి అధికారంలోకి వచ్చింది. 22 మంది స్థానాలకు పరిమితం కావడంతో పాటు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి ఆప్ అగ్రనాయకులు సహితం ఓటమి చెందారు.