
దేశ, విదేశాల నుంచి వస్తున్న యాత్రికులతో మహాకుంభమేళతో వాణిజ్యం పెరుగుతోంది. యాత్రికులు చేసే ఖర్చులు వల్ల ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రూ.3లక్షల కోట్లు సమకూరుతాయని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీలో తెలిపారు. 10 కోట్ల మందికి ఉపాధి కలుగుతుందని, మహాశివరాత్రి వరకూ కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 60 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
యూపీ ప్రభుత్వం మహాకుంభ మేళాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్ రాజ్‌లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా 2030 నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల కోసం 3000 వంటశాలలు, 1,50,000 మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేశాయి. 40 కిలోమీటర్ల మేర 25 సెక్షన్లుగా విభజించి టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఇందులో నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్,నీళ్లు, సెల్ టవర్లు, 11 ఆసుపత్రులను భక్తులకు అందుబాటులో ఉంచారు. నది ఇసుకతిన్నెల్లో విలాసవంతమైన గోపురాలు నిర్మించారు.
వీటిలో బస చేయడానికి ఒక్క రాత్రికే 1000 డాలర్లు చెల్లించాలి. నదిలో బోటు ప్రయాణాలు, హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆటోలు, బస్సులు, రిక్షాలు, ప్రైవేటు వాహనాల్లో యాత్రికులు చేసే ప్రయాణాలతో భారీగా నగదు లభిస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది మందికి 45రోజులపాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి.
మహాకుంభమేళాలో ఇచ్చే వాణిజ్య ప్రకటనలు, హోర్డింగ్‌లు వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వీటితో పాటు యాత్రికులు చేసే ఖర్చులు వల్ల ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కుంభమేళా బలం చేకూరుస్తోంది. ఈ తరహా మతపరమైన వేడుకలు ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకి పరోక్షంగా సాయపడతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సుమారు 8వ శతాబ్ధం నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచారించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2030 నాటికి భారత్‌లో ఆధ్యాత్మిక పర్యటకం 10 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయ పర్యటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా 60 శాతం ఉంటుందని తెలిపాయి.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా