ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి 

ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి 

పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ప్రోగ్రామ్ కింద ఏపీలో మూడు పారిశ్రామిక 3  కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి, త్వరితగతిన పూర్తి చేస్తామని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేశారని చెప్పారు.

దేశవ్యాప్తంగా పౌర/రక్షణ రంగంలో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో 8 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో 4,741 కి.మీ.కు పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశామని పేర్కొన్నారు.

భారతమాల ప్రాజెక్ట్ కింద 5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భారతామాల పరియోజన దశ -1 కింద ఆంధ్రప్రదేశ్‌లో 2,525 కి.మీ. జాతీయ రహదారి కారిడార్ల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఏపీలో రూ. 14,000 కోట్ల విలువైన బెంగళూరు – కడప – విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవేలకు 14 ప్యాకేజీలకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.

2009- 2014 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు రూ.886 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. 2024-25లో ఆంధ్రప్రదేశ్‌కు 11రెట్లు అదనంగా రూ.9,417 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎర్రుపాలెం- అమరావతి మీదుగా నంబూరు మధ్య 57 కి.మీ.ల కొత్త లైన్ నిర్మాణం 5 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని వివరించారు. 

ఆంధ్రప్రదేశ్ వందశాతం విద్యుదీకరణ  జరిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 6 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ ధరలను బట్టి చమురు ధరలు ఉంటాయని తెలిపారు. అవకాశం ఉన్నంతవరకు తగ్గించాలనే తమ భావన కూడా ఉందని చెబుతూ  గత మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉన్నాయని, తగ్గించామని తెలిపారు. 

ఉజ్వల కింద గ్యాస్ సిలిండర్‌లను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. గ్యాస్ పైపు లైన్ వేసేందుకు కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.  ఢిల్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిశానని చెప్పారు. రాష్ట్ర ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం వారు ఎంతో కష్ట పడుతున్నారని తెలిపారు. 

కేంద్ర మంత్రులను కలిసి అనేక ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వాలని కోరుతున్నారని పేర్కొంటూ ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. టూరిజం టెంపుల్ ద్వారా ప్రజలకు ఆధ్యాత్మికం, ఆహ్లాదం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏయిమ్స్ మంగళగిరిని జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు.