
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కొర్రితో రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా నదీ నీటి వినియోగంపై శుక్రవారం జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కెఆర్ఎంబి) సమావేశం వాయిదా పడింది. అప్పటికే అన్నింటికి సన్నద్దమైన జలసౌధకు చేరుకున్న తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశం వాయిదాపై తమ నిరసన వ్యక్తం చేశారు.
సుమారు గంటపాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మ న్ అతుల్ జైన్ తో తెలంగాణ అధికారులు సమావేశమై తమ వాదనలను వినిపించారు. ప్రస్తుత నీటి సంవత్సరం 2024-25 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాబోర్డు లెక్కల ప్రకారంగా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకుందని, ఇకపై కృష్ణా నదీ జలాలలో ఒక్క చుక్క కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలించకుండా అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా అధికారికంగా బోర్డు చైర్మన్‌కు లేఖను అందజేశారు. తెలంగాణకు ఈ ఏడాది మే వరకు కావాల్సిన తాగునీటి అవసరాలకు 17 టిఎంసి,సాగునీటి అవసరాలకు గాను 90టిఎంసి కలిపి మొత్తం 107 టిఎంసిల నీటిని విడుదల చేయాలని ఆలేఖలో కోరారు.
కాగా, కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు ప్రత్యేక సమావేశానికి హాజరుకాకుండా ఏపీ అధికారులు వెనుకడుగు వేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లుగా తెలంగాణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మే నెలాఖరు దాకా కృష్ణా నదీ నీటి వినియోగం అంశంపై వివాదాలకు అస్కారం ఉండొద్దనే లక్ష్యంతో శుక్రవారం ప్రత్యే సమావేశాన్ని కృష్ణా బోర్డు ఏర్పాటుచేసింది.
అయితే ఇప్పటికే తమ నీటివాటాకు మించి వాడుకున్న ఏపీ సర్కారు బోర్డు సమావేశానికి హాజరుకాకుండా వాయిదా కోరడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ జైన్‌ను కలుసుకుని తెలంగాణకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన సమావేశానికి తెలంగాణ అధికారులు సన్నద్దం అయ్యారు. అయితే హఠాత్తుగా ఏపీ ప్రభుత్వం నుంచి బోర్డు సమావేశాన్ని వాయిదావేయాలన్న సమాచారం రావడంతో అందరూ అవాక్కైయ్యారు. ఈ మేరకు ఏపీ వాటర్ రిసోర్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ నుంచి కృష్ణా బోర్డుకు అధికారికంగా లేఖ అందింది.
తమకు ముందుగా నిర్ణయించిన అధికారిక సమావేశాలు ఉన్నందున శుక్రవారం నాటి బోర్డు సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని, దానిని సోమవారం మధ్యాహ్నం వాయిదా వేయాలని సూచించారు. దాంతో కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అధికారికంగా సమావేశాన్ని సోమవారం 24వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి