ప్రకంపనలు సృష్టిస్తున్న ఓటింగ్ పెంచేందుకు అమెరికా నిధులు!

ప్రకంపనలు సృష్టిస్తున్న ఓటింగ్ పెంచేందుకు అమెరికా నిధులు!
భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంపుకోసం ఇస్తున్న నిధులను ఇటీవల అమెరికా రద్దు చేయటం రాజకీయ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా అందించిన 21 మిలియన్‌ డాలర్ల నిధులపై రాజకీయ రగడ అంతకంతకూ పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సంచలన ఆరోపణలతో వివాదం మరో మలుపు తిరిగింది. 
 
ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించటంతోపాటు బైడెన్‌ ప్రభుత్వంపై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌లో మరెవరినో గెలిపించడానికి ఆ నిధులు కేటాయించారని ఆరోపించారు. తాజాగా అది కిక్‌బ్యాక్ స్కీమ్‌ అని ట్రంప్‌ దుయ్యబట్టారు.
 
భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియలో జ్యోకం చేసుకునేందుకు గత బైడెన్ ప్రభుత్వం 21 మిలియన్ డాలర్లు కేటాయించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేయడం, అక్కడ ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నం చేసినట్టు ఉందని వ్యాఖ్యనించడంపై భారత విదేశాంగ శాఖ శుక్రవారంనాడు స్పందించింది. అమెరికా కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్ సమాచారం తీవ్రంగా కలవరపెడుతోందని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.

‘యూఎస్ఏ కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్‌ పేర్కొన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇది తీవ్రంగా కలవరచే అంశం. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకే వస్తుంది. దీనిపై సంబంధిత శాఖలు, ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు దీనిపై వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది. సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత దీనిపై అప్డేడ్‌తో మీ ముందుకు వస్తాం” అని మీడియాతో మాట్లాడుతూ రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ గురువారంనాడు వాషింగ్టన్ డీసీలో జరిగిన రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ, “భారత్‌లో ఎన్నికల కోసం మనం 21 మిలియన్ డాలర్లు ఎందుకు కేటాయించాలి? మనకే చాలా సమస్యలు ఉన్నాయి. మనం మన ఎన్నికల గురించి చూసుకోవాలి. భారత్‌లో ఎన్నికల కోసం 21 మిలియన్ డాలర్లు కేటాయించిన విషయం మీకు తెలుసా? అక్కడే ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది కిక్‌బ్యాక్ స్కీమ్‌లా కనిపిస్తోంది” అంటూ తీవ్రంగా వాఖ్యలు చేశారు. 

దీనికి ముందు ఫిబ్రవరి 16న అమెరికా డోజ్ శాఖ యూఎస్ఏఐడీ నిధుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పొదుపు చర్యల్లో భాగంగా భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉద్దేశించి 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తు్న్నట్ట ప్రకటించింది. దానితో యూఎస్ఏఐడీ నిధులు భారత్‌లో ఎవరికి చేరాయో చెప్పాలనే డిమాండ్లు భారత్‌లో మొదలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదానికి కూడా దారితీసింది. 

కాంగ్రెస్ హయాంలో యూపీఏ ప్రభుత్వానికి, ఎన్జీఓలకు మిలియన్ డాలర్ల నిధులు అందాయని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక నిధుల రాకడ తగ్గిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే ఈ వాదనను కాంగ్రెస్ కొట్టివేసింది. ట్రంప్ చేసిన ఆరోపణల్లో ఆర్థం లేదని, యూఎస్ఏఐడీ నిధులు ఎవరెవరికి అందాయనే వివరాలతో ఆయన శ్వేతపత్రం విడుల చేయాలని డిమాండ్ చేసింది.

ఇలా ఉండగా, యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై ఇండియన్ ఎక్స్ ప్రెస్  ఓ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అందులో అమెరికా ఆరోపణలు చేస్తున్న 21 మిలియన్‌ డాలర్ల సాయం 2022లో బంగ్లాదేశ్‌ కోసం కేటాయించినట్లు పేర్కొంది. బంగ్లాలో అమర్‌ ఓట్‌ అమర్‌ అనే ప్రాజెక్ట్‌ కోసం ఆ నిధులు మంజూరు చేశారని, ఇప్పటికే 13.4 మిలియన్‌ డాలర్లు ఆ దేశానికి ఇచ్చినట్లు ఆ కథనంలో ఉంది. 

ఈ కథనాన్ని కాంగ్రెస్‌ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. “21మిలియన్‌ డాలర్ల అమెరికా సాయం బంగ్లాదేశ్‌లోని ఎన్జీవోలకు వెళ్లింది. దేశంలోని ప్రభుత్వాలను, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఆర్‌ఎస్ఎస్‌ దశాబ్దాల నుంచి అమెరికా నుంచి నిధులు పొందుతోంది. ఇది మా వాదన మాత్రమే కాదు సీఐఏ ఏజెంట్‌ కూడా చెప్పారు. సీఐఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఓ పుస్తకం రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ విధంగా కీలుబొమ్మలా మారిందో పేర్కొన్నారు” అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా తీవ్రమైన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ విషయంపై ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన కథనాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అది నకిలీ, అవాస్తవ కథనమని పేర్కొంది. భారత్‌లో ఓటర్ల శాతం పెంచేందుకు 21మిలియన్‌ యూఎస్‌ డాలర్లు ఇచ్చినట్లు అమెరికాకు చెందిన డోజ్‌ చెప్పినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా తెలిపారు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడి కంటే మరొకరికి ఎక్కువగా తెలుసా? అని ప్రశ్నించారు.

“ఫ్యాక్ట్‌ చెక్కర్లుగా పిలవబడేవారికి గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. వారి పని ఫ్యాక్ట్‌ చెకింగ్‌ కాదు. కేవలం రాహుల్‌గాంధీ చెప్పే అసత్యాలను సత్యాలుగా చిత్రీకరించి ముందుకు తీసుకెళ్లటమే. వారికి కూడా ఫండింగ్‌ జరుగుతోంది. అందుకే ఉదయం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన ఫ్యాక్ట్‌ చెక్కర్లు 21మిలియన్‌ యూఎస్‌ డాలర్లతో భారత్‌కు సంబంధం లేదని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు” అంటూ భాటియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“ఇది ఆందోళన కలిగించే విషయం. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగం ప్రకారం దేశ సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడతానని ప్రమాణం చేశారు. కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలను క్రియాశీలంగా చేస్తున్నారు. స్వచ్ఛమైన దేశ ఎన్నికల ప్రక్రియలో దేశ వ్యతిరేక శక్తుల జోక్యాన్ని ప్రోత్సహిస్తున్నారు.”
అంటూ విమర్శలు గుప్పించారు.