మిర్చి ధర క్వింటాల్ రూ 11,600కు పైగా పెంచాలి

మిర్చి ధర క్వింటాల్ రూ 11,600కు పైగా పెంచాలి
 
మిర్చి క్వింటాల్ ధర రూ.11,600కు పైగా పెంచాలని కోరామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు, రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. అమరావతి నుంచి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. 
 
ఈ సమావేశంలో మిర్చి రైతుల సమస్యలపై చర్చించారు. సమావేశం అనంతరం రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ మిర్చి సేకరణను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫరెన్స్‌ ఆఫ్‌ ప్రైస్‌ చెల్లించడానికి ఉన్న మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ (ఎంఐసి) 25 శాతాన్ని గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఆమోదం తీసుకుని 75 శాతం వరకు పొడిగి స్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. 
 
మార్కెట్‌ ధర, ఉత్పత్తి ఖర్చు మధ్య తేడాను కూడా పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. క్వింటా మిర్చి ధర రాష్ట్ర ప్రభుత్వం రూ.11,600 నిర్ణయిస్తే, కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల వరకే ఇచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని కూడా లేవనెత్తామని, క్వింటా ధర రూ.11,600, ఆపై ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఐకార్‌కు సంబంధించిన అధికారులను కూడా పిలిపించారని, ఆ ధరను ఆమోదించాలని వారికి కేంద్ర మంత్రి చౌహాన్‌ ఆదేశాలిచ్చారని తెలిపారు. 
 
మిర్చి ఎగుమతులు గతంలో జరిగినట్లు ఇప్పుడు జరగటం లేదని, దానిపై కూడా చర్చించామని పేర్కొన్నారు. మిర్చి ఎగుమతులను ప్రోత్సాహించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి అమలుపైనా చర్చించామని తెలిపారు.  త్వరలో రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో ఒక సదస్సు ఏర్పాటుచేసి, వారి సమస్యలు తెలుసుకుని, సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తక్షణమే మిర్చి ఎగుమతులను పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానించడంపై వచ్చే సలహాలు, సూచనలు అమలు చేస్తామని శివరాజ్‌సింగ్‌ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.