
భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకులు తయారుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, బ్యూరోక్రసీ, వ్యాపారం సహా అన్ని రంగాల నుంచి ప్రపంచ స్థాయి నాయకులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. డిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ (సోల్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాలను తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తిసామర్థ్యాలను నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకులను తయారుచేసే విషయంలో ‘సోల్’ గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. వికసిత్ భారత్ (అభివృద్ధి భారతం) ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూషన్ ప్రారంభించడం ఒక ల్యాండ్‌మార్క్ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
“జాతి నిర్మాణంలో పౌరుల అభివృద్ధి కీలకం. మనకు ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయి నాయకులు కావాలి. ఆ దిశగా మన ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ కీలకమైన ముందడుగు అవుతుంది” అని మోదీ చెప్పారు. గిఫ్ట్ సిటీ సమీపంలో సోల్ కొత్త క్యాంపస్ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఆర్కిటెక్చరల్ అచీవ్‌మెంట్ ఇదొక బెంచ్‌మార్క్ అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మోడల్, ప్లాన్‌ను తనకు చైర్మన్ చూపించారని చెప్పారు.
కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనే నాయకత్వం అవసరం ఉందని మోదీ చెప్పారు. యువ నేతలతోనే భారత్ లో మార్పు సాధ్యమని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ప్రధాని గుర్తు చేశారు. వందమంది శక్తివంతులైన యువతీయువకులను తనకు ఇస్తే భారత్ ను మార్చి చూపిస్తానని ఆయన చెప్పేవారని, సరైన నాయకులతో భారత్ కేవలం స్వాతంత్య్రం పొందడమే కాకుండా గ్లోబల్ లీడర్‌గా కూడా నిలుస్తుందని తాను బలంగా నమ్ముతానని ప్రధాని చెప్పారు.
ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని అనే ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తుచేశారు. గుజరాత్‌లో బొగ్గు లేదు, కీలకమైన సహజవనరులు లేవు, నీళ్లు లేవు, కేవలం ఎడారి, పాకిస్థాన్ సరిహద్దు అని చెప్పేవారని గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగా గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని, ఎకనామిక్ పవర్‌హౌస్‌గా నిలిచిందని స్పష్టం చేశారు.
ఈ సదస్సులో భూటాన్ ప్రధాని దషో షేరింగ్ తోబ్గే కూడా పాల్గొంటూ ‘సోల్’ అనేది నరేంద్ర మోదీకి వచ్చిన ‘కళాత్మక ఆలోచన’ అని అభివర్ణించారు. భారతదేశానికి సేవ చేయడానికి అనుగుణంగా యువతను శక్తివంతం చేయడంలో మోదీకున్న అచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శమని తెలిపారు. మోదీని తన ‘గురువు, అన్నయ్య’గా తోబ్గే పేర్కొన్నారు. ఆయనను కలిసినప్పుడు ప్రజా సేవకుడిగా మరింత కష్టపడి పనిచేయడానికి తనకు ప్రేరణ లభిస్తుందని చెప్పారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి