కశ్మీర్‌లో మంచు ప్రభావం తగ్గుతుండడంతో పెరుగుతున్న చొరబాట్లు

కశ్మీర్‌లో మంచు ప్రభావం తగ్గుతుండడంతో పెరుగుతున్న చొరబాట్లు

కశ్మీర్‌లో మంచు ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల ఉగ్ర చొరబాట్లు పెరిగాయని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల వారి కార్యాచరణ పరిధి విస్తరించిందని, భద్రతా దళాలకు ముప్పు పెరిగిందని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో చాలా తక్కువ హిమపాతం నమోదు కావడమే ముష్కరుల కదలికలు పెరగడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. 

కశ్మీర్‌లో ఎక్కువ మంచు, వర్షం లేకపోవడం వల్ల పిర్ పంజాల్ శ్రేణుల నుంచి ముష్కరుల కదలికలను సులభతరం చేస్తోందని చెబుతున్నారు. ఉగ్రవాదులు దాడులు చేస్తూ క్రియాశీలంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ముందు జమ్మూలో ఉగ్రకార్యకలాపాలు పెరిగాయని, ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ మద్దతును పెంచిందని స్పష్టం అవుతుంది.

ఒకవైపు జమ్మూలో ఉగ్రకార్యకలాపాలు పెరుగుతుండగా, మరోవైపు కశ్మీర్‌లోనూ ముష్కరుల కదలికలు పెరిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పుల్వామా, అనంత్‌నాగ్‌, దోడా జిల్లాల్లో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో పెద్ద ఎత్తున చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు భద్రతా దళాలను గత నవంబర్ లోనే హెచ్చరించాయి. సుమారు 150 మంది సరిహద్దు దాటి ప్రవేశించేందుకు పాకిస్తాన్ వైపు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.

పిర్ పంజాల్ శ్రేణికి ఉత్తరాన 4 నుంచి 5 మంది లష్కరే తోయిబా సభ్యులు చురుకుగా ఉన్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. మొత్తంగా కశ్మీర్‌లో ప్రస్తుతం 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని భద్రతా దళాలు అంచనా వేశాయి.  జమ్మూకశ్మీర్‌లో అదనంగా శిక్షణ పొందిన ఉగ్రవాదులను ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లోకి పాకిస్తాన్ పంపింది. 

తొలుత ఈ గ్రూపులను జమ్మూలోకి పంపింది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత జమ్మూలో ఉగ్రకార్యకలాపాలు పెరిగాయి. జమ్మూలోకి చొరబడిన ఈ ఉగ్రవాదులు ఇప్పుడు పిర్ పంజాల్ దాటి దక్షిణ కశ్మీర్ లోయలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద శిబిరాలను నెలకొల్పుతూ, జమ్మూ కశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ తెలిపారు. 

గత కొన్ని నెలలుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగాయని, ఫలితంగా పౌరులు, భద్రతా సిబ్బంది కూడా మరణించారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు భద్రతా సమావేశాలు నిర్వహించారని వివరించారు.

జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు, మూడుసార్లు భద్రతా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలు చురుకుగా సాగుతున్నాయని, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

 రాజౌరి, పూంచ్‌లలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికలున్నాయి. అఖ్నూర్‌లో ఐఈడీ పేలుడుతో ప్రాణనష్టం సంభవించింది. ఇది పాకిస్థాన్‌ మరోసారి కశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని సూచిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తగు చర్యలు చేపట్టారు.