ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా నక్సలైట్లు హతం

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా నక్సలైట్లు హతం

మధ్య ప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో బుధవారం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించినట్లు పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన నక్సల్ వ్యతిరేక హాక్ దళం, స్థానిక పోలీస్ బృందాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు అదనపు ఎస్‌పి విజయ్ దబర్ తెలియజేశారు. 

జిల్లా కేంద్రానికి సుమారు 90 కిమీ దూరంలోని ఒక ప్రదేశంలో బుధవారం ఉదయం కాల్పుల పోరు చోటు చేసుకున్నదని, ఇతర వివరాలు ఇంకా అందవలసి ఉందని దబర్ తెలిపారు. ‘గఢీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్‌ఖర్ అటవీ రేంజ్‌లో రోండో అటవీ శిబిరం సమీపంలో ఎన్‌కౌంటర్‌లో కరడు గట్టిన నక్సలైట్లను హాక్ దళం, పోలీసులు అంతమొందించారు’ అని అధికార ప్రకటన తెలియజేసింది. 

పోలీసులు ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్), ఒక .303 రైఫిల్‌ను అత్యవసరమైన దైనందిన వినియోగ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. ఎన్‌కౌంటర్‌లో కొందరు నక్సలైట్లు గాయపడ్డారని, కానీ వారి పారిపోయారని ఆ ప్రకటన తెలిపింది. వారి ఆచూకీ తీసేందుకు 12 పోలీసు బృందాలు గాలింపు సాగిస్తున్నట్లు ఆ ప్రకటన తెలియజేసింది.