
డిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపికయ్యారు. ఆమెను బిజెపి శాసనసభాపక్ష నేతగా ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదటిసారి ఎంఎల్ఎ రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడించిన పర్వేశ్ వర్మ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్‌గా విజయేంద్ర గుప్తాను ఎంపిక చేశారు. గురువారం సిఎంతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి శాసనసభాపక్షం తనను నాయకురాలిగా ఎన్నుకోగానే రేఖా గుప్తా లెఫ్టనెంట్ గవర్నర్ వికె సక్సేనాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
బిజెపి 27 సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆప్‌ను ఓడించింది. అసెంబ్లీలోని 70 సీట్లలోకి 48 సీట్లను బిజెపి కైవసం చేసుకున్నది. ఆప్ 22 సీట్లతోసరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఈసారి కూడా ఒక్క సీటూ దక్కలేదు.
నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అధిష్ఠాన పరిశీలకులుగా విశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం రేఖా గుప్తా పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు.
ఫిబ్రవరి 20న (గురువారం) మధ్యాహ్నం గంటలకు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రఖ్యాత రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి-ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.
ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొననున్నారు.
విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించే నేతల్లో ఆమె ఒకరు. షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనాకుమారిని 29 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
1994-95 సంవత్సరంలో ఆమె దౌలత్ రామ్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1995-96 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
1996-97 సంవత్సరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. 2003 నుంచి 2004 వరకు బీజేవైఏం ఢిల్లీ కార్యదర్శి పదవిని నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు బీజేవైఏం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?