టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి వీరంగం

టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి వీరంగం

గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ బయటకు పంపట్లేదని సమాధానం ఇచ్చినందుకు ఉద్యోగిపై పరుష పదజాలంతో ఆలయం ఎదుటే దూషించారు. బోర్డు సభ్యుడు అసభ్యంగా మాట్లాడడం చూసి అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు.

ఉద్యోగి మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించిన తీరును చూసి భక్తులు, సాటి ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. ”నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. ఏయ్‌ నువ్వు బయటకు పోవయ్యా, థర్డ్‌ క్లాస్‌ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు. వాడి పేరేంటి. నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు బయటకు పో, ఏం మాట్లాడుతున్నావు” అంటూ వీరంగం సృష్టించారు.

కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోర్డు సభ్యుడు భక్తిశ్రద్ధలతో ఉండకుండా బూతులు మాట్లాడటం ఏంటి అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, సిబ్బంది, భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే సంయమనం కోల్పోయి వీధి రౌడీలా దూషణలకు దిగి ఆ పదవికి ఉన్న గౌరవాన్ని మంటగలిపారని అంటున్నారు. 

ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, ఇలా ఇష్టం వచ్చినట్టు ఉద్యోగులపై పెత్తనం ప్రదర్శించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్‌ మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమ వారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. 

బోర్డు సభ్యుడి సహాయకుడు గేటు తీయాలని ఉద్యోగి బాలాజీని కోరారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని ఉద్యోగి సమాధానమిచ్చారు. దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్​కుమార్ ​ ఉద్యోగిపై అసభ్య దూషణకు దిగారు.

ఇంతలో అక్కడకు చేరుకున్న టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపారు. ఈ ఘటనపై నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ కొందరు ఉద్యోగులు కనీసం తమ స్థాయికి కూడా గౌరవం ఇవ్వట్లేదని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.