బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టొచ్చు

బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టొచ్చు

ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చునని బిజెపి నేత, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే బయ్యారంలో ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు రాలేదన్న ప్రచారం వాస్తవం కాదని, చాలా నిధులు కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.6,300 కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇంత చేస్తుంటే, బయ్యారంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవచ్చు కదా? అని ఈటల ప్రశ్నించారు. 

రాష్ట్రాల వారీగా కులగణనకు తమ పార్టీ అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పేర్కొంటూ  బీసీ జనాభా 52  నుండి 46 శాతంకు తగ్గించి ప్రకటించారని  చెప్పారు.

బీసీ కులగణన పేరిట అభాసుపాలయ్యారని,  ఇది సిగ్గుమాలినతనం అని ధ్వజమెత్తారు. ప్రజల వ్యతిరేకత తట్టుకోలేక లేదు లేదు మళ్లీ చేస్తాం అంటూ రీసర్వే చేపట్టారని తెలిపారు. చట్టబద్దత శాస్త్రీయత లేకుండా అమలు కాదు అనే విషయం తెలీదా? అని ప్రశ్నించారు.  ఏదో లబ్ధి పొందాలని చూస్తే పాతర వేస్తారని హెచ్చరించారు.

కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని,  అబద్దాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు మసి పూసి మారేడు కాయలు చేస్తున్నారని విమర్శించారు.  కెసిఆర్ 317 జీఓ ఇచ్చి డీఏ ఇవ్వకుండా సిపిఎస్ పెన్షన్ విధానం అమలు చేసి ఇబ్బంది పెడితే,  ఇవన్నీ అధికారంలోకి రాగానే సరి చేస్తా అని చెప్పిన రేవంత్ ఒక్కటీ అమలుచేయలేదని ఈటెల మండిపడ్డారు.

కెసిఆర్ మీద వ్యతిరేకతకు 9 ఏళ్లు పడితే, రేవంత్ మీద వ్యతిరేకతకు 9 నెలలే పట్టిందని చెప్పారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని లేపడానికి  అంకుశంతో పొడిచే శక్తి ఒక్క బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కట్టుబానిసల లెక్క ఉంటారని, బీజేపీని గెలిపిస్తే మీకోసం కొట్లాడతారని ఆయన స్పష్టం చేశారు.