సాంకేతిక, తయారీ రంగాలలో ఖతార్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి

సాంకేతిక, తయారీ రంగాలలో ఖతార్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి

 
* వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ ఒప్పందాలు

భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సమక్షంలో హైదరాబాద్ హౌస్ లో జరిగింది. ఖతార్ అమీర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పర్యటన భారత్-ఖతార్ బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.  ప్రధాని మోదీ, ఖతార్ అమీర్  బిన్ హమద్ అల్‌థని విస్తృత శ్రేణిలో చర్చలు జరిపారు.  ఉభయ దేశాల మధ్య ‘ప్రగాఢ, సాంప్రదాయక అనుబంధాన్ని’ మరింత పటిష్టం చేస్తూ వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ఇంధన శక్తి, ప్రజల మధ్య సంబంధాలపై దృష్టితో ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా భారత్ ఖతార్ సంబంధాలను మార్చడానికి ఉభయ నేతలు నిర్ణయించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని రెండు దేశాలు నిర్దేశించుకున్నాయి.

సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అన్వేషించడానికి అంగీకరించాయి. భారతదేశ మౌలిక సదుపాయాలు, సాంకేతికత, తయారీ రంగాలలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఖతార్ సంసిద్ధత ప్రకటించింది. అదనంగా, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ భారతదేశంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది, ఇది లోతైన ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తుంది.

ఆర్థిక వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించడానికి జూన్ 2024లో సమావేశమైన పెట్టుబడులపై జాయింట్ టాస్క్ ఫోర్స్ పురోగతిని రెండు దేశాలు ప్రశంసించాయి. వారు పరస్పర ప్రయోజనకర ‘ప్రాంతీయ, ప్రపంచ సమస్యల’పై కూడా అభిప్రాయాలు తెలుసుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఒప్పందాలను మార్చుకున్నారు. ఆదాయపు పన్నులకు సంబంధించి ద్వంద్వ పన్నుల ఎగవేత,ఆర్థిక మోసాలను నివారించే సవరించిన ఒప్పందం కూడా ప్రకటించారు. ఖతార్ ప్రధాని, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య మరో కీలక ఒప్పంద మార్పిడి జరిగింది.

భారతదేశం,ఖతార్ మధ్య ఆదాయపు పన్నులకు సంబంధించి ద్వంద్వ పన్నుల ఎగవేత మరియు ఆర్థిక ఎగవేత నివారణకు సవరించిన ఒప్పందాన్ని కూడా మార్చుకున్నట్లు హైదరాబాద్ హౌస్‌లో జరిగిన వేడుకలో ప్రకటించారు.  ప్రధాని మోదీ ఆహ్వానంపై ఖతార్ అమీర్ రెండు రోజుల పర్యటన చోటు చేసుకున్నది. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖతార్ అమీర్ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. దీనికి ఉప రాష్ట్రపతి,  ప్రధానమంత్రి,  ఖతార్ నుండి వచ్చిన ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అమీర్ అల్ థానీని స్వాగతిస్తూ, అధ్యక్షుడు ముర్ము భారతదేశం, ఖతార్ మధ్య ఉన్న లోతైన చారిత్రక సంబంధాలను ప్రస్తావించారు. వారి శతాబ్దాల నాటి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేసుకున్నారు.

“మన సంబంధం దౌత్యం, రాజకీయాలను మించిపోయింది” అని అధ్యక్షుడు ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశం, ఖతార్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రస్తావించగారు. గత సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $14 బిలియన్లకు చేరుకుందని ఆమె గుర్తు చేశారు.

మంగళవారం ఉదయం ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో సాంప్రదాయక గౌరవ వందనం సమర్పించారు. ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. భారత్, ఖతార్ మధ్య ప్రగాఢ చారిత్రక మైత్రి, విశ్వాసం, పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలు ఉన్నాయని, ఇటీవలి సంవత్సరాల్లో వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన శక్తి, టెక్నాలజీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా రెండు దేశాల మధ్య అనుబంధం దృఢతరం అవుతూనే ఉందని ఎంఇఎ అంతకుముందు తెలియజేసింది. 

ఉభయ నేతలు హైదరాబాద్ హౌస్‌లో చర్చలు జరుపుతుండగా, ఈ ‘ప్రత్యేక భారత్ ఖతార్ భాగస్వామ్యం’లో ‘కొత్త మైలురాయి’ నెలకొనబోతున్నదని ఎంఇఎ ‘ఎక్స్’ పోస్ట్‌లో సూచించింది. ప్రధాని మోదీ నిరుడు ఫిబ్రవరిలో గల్ఫ్ దేశం ఖతార్‌ను సందర్శించిన దాదాపు ఏడాది తరువాత ఖతార్ అమీర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు అరుదైన మర్యాద పురస్సరంగా ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.