మహా కుంభ్ పై మమతా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

మహా కుంభ్ పై మమతా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
మహాకుంభ్ కాస్త మృత్యు కుంభమేళాగా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో కుటుంభ సభ్యులతో కలిసి మంగళవారం పాల్గొన్న ఆయన ఆమె ప్రకటనను అనుచితంగా అభివర్ణించారు.

“సనాతన ధర్మం- హిందూ మతంపై వ్యాఖ్యలు చేయడం ప్రజలకు చాలా సులభం. ఇది మన రాజకీయ నాయకుల సమస్య. వారు హిందూ మతాన్ని విమర్శించినంత తేలికగా ఇతర మతాలను విమర్శించరు. అలాంటి నాయకులతో, ఇది కష్టం అవుతుంది. వారి మాటలు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని వారు గ్రహించరు” అని అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కుంభమేళాలో జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “కుంభమేళా సమయంలో కొన్ని సంఘటనలు జరిగితే, దానిని నిర్వహణ వైఫల్యంగా పరిగణించలేము. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం ఏ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సవాలు. దురదృష్టకర సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు” అని చెప్పారు. 

“నాకు తెలిసినంత వరకు, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తోంది. కొన్ని సంఘటనలు దురదృష్టకరం, కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదు” అని పవన్ స్పష్టం చేశారు.

అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పవన్ సూచించారు. “సీనియర్ రాజకీయ నాయకులకు నేను చెబుతున్నాను. అలాంటి ప్రకటనలు చేయవద్దని కోరుతున్నాను. నా అభిప్రాయం ఏంటంటే అలాంటి వ్యాఖ్యలు తగనివి” అని ఆయన మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

అంతకు ముందు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత నెల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోగా, 60 మందికి గాయాలయ్యాయని, ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ కారణంగా 18 మంది మరణించారని మమతా బెనర్జీ తెలిపారు. “మహాకుంభ్ కాస్తా మృత్యు కుంభమేళాగా మారింది. మరణసంఖ్యను తగ్గించి చూపేందుకు వారు (బిజెపి ప్రభుత్వం) వందలాది భౌతిక కాయాలను దాచిపెట్టింది” అని ఆమె ఆరోపించారు.

ఇలా ఉండగా,  వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నా రు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరానందన్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, టీటీడీ సభ్యుడు ఆనంద సాయితో కలిసి ఆయన మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమానికి హారతులిచ్చారు.

“భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధ ర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు” అని తెలిపారు.