కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కోజికోడ్‌ జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కోజికోడ్‌ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు రెండు ఏనుగుల్ని తీసుకువచ్చారు. 
 
ఆ సమయంలో నిర్వాహకులు బాణాసంచా పేల్చడంతో ఏనుగులు బెదిరిపోయి, జనాన్ని తొక్కుకుంటూ, దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా ఈ ఘటనపై కౌన్సిలర్‌ మాట్లాడుతూ ‘ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. ఉత్సవం చివరి రోజున ఊరేగింపు కోసం ఏనుగులను ప్రదర్శిస్తున్న సమయంలో నిర్వాహకులు పటాకులు పేల్చారు. పటాకుల శబ్దాలతో బెదిరిపోయిన ఒక ఏనుగు మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఏనుగుల ఘర్షణతో తాత్కాలికంగా ఏర్పాటు ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో వున్న ప్రజల మధ్య తోపులాట జరిగింది’ అని తెలిపారు. 
 
ఇక ఈ ఘటనపై కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్‌ జమీలా స్పందించారు. తోపులాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇక ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.