
* ట్రంప్ భారత్ కు ఎఫ్-35 యుద్ధ విమానాల అమ్మకంకు సిద్ధం
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే ప్రణాళికలో భారత్ పాత్రపై మాట్లాడిన ట్రంప్- తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే రెండు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతాయని అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత్- అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్- అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నామని చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలు ఎఫ్-35లను విక్రయించడానికి ముందుకొచ్చారు. ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత వైట్ హౌస్‌ను సందర్శించిన నాల్గవ ప్రపంచ నాయకుడు అయిన ప్రధాని మోదీతో భారతదేశంతో తాను “ప్రత్యేక బంధాన్ని” కనుగొన్నానని ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీని తన కంటే “చాలా కఠినమైన సంధానకర్త” అని ప్రశంసించారు.
“ఈ సంవత్సరం నుండి, మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము” అని ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన మోదీని ట్రంప్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
రెండో సారి వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టిన ట్రంప్‌నకు 140కోట్ల మంది భారతీయుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. ట్రంప్ అనే పేరు, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనివని మోదీ వివరించారు. అలాగే 140 కోట్ల మంది భారతీయులకు కూడా 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందని మోదీ తెలిపారు.
ట్రంప్ హయాంలో ఇరుదేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించిన మోదీ అహ్మదాబాద్, హ్యూస్టన్‌లలో నిర్వహించిన నమస్తే ట్రంప్, హౌడీ- మోదీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లు కలిస్తే ఒకటి ఒకటి పదకొండు అవుతుందని అని మోదీ చెప్పారు.
More Stories
కోల్‌కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం