మరో రెండు విమానాల్లో రానున్న భారతీయులు

మరో రెండు విమానాల్లో రానున్న భారతీయులు

అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాలు భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుండి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమెరికా చేపడుతోన్న డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్‌కు తీసుకువచ్చారు. ఈ వ్యవహారంపై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది. దీంతో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా, 2019లో గరిష్ఠంగా 2042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది. 

అయితే, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృతసర్ లో దించడంపై తాజా వివాదం కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌ ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించుతున్నారని పంజాబ్‌ ఆర్థికశాఖ మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా ఆరోపించారు.

ఇలా ఉండగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ  మానవ అక్రమ రవాణా వ్యవస్థపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవస్థను అంతం చేయడానికి భారత్, అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. అక్రమ వలసదారుల సమస్యను అమెరికాలో ఉన్న భారతీయుల ముందు చర్చిస్తూ, ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారికి అక్కడ ఉండే హక్కు లేదని స్పష్టం చేశారు.

“ఇతర దేశాల్లో అక్రమంగా నివసించడానికి ఎవరైనా వెళ్ళినప్పుడు, అది వారి హక్కు కాదు” అని తేల్చి చెప్పారు.  “భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తుంటే, వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.  “ఈ అక్రమ వలస దారుల ద్వారా ఎవరూ మోసపోకూడదు. సాధారణ కుటుంబాలకు చెందిన చాలా మంది ఏజెంట్ల మాటలను నమ్మి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు” అని పేర్కొంటూ ఇది వారికే కాకుండా ఆ దేశాలకి కూడా ప్రమాదం తెస్తుందని ఆయన హెచ్చరించారు.