
గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు మార్గం సుగమం చేసేందుకు మరింత మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందంలో ముందుగా అనుకున్న ప్రకారమే బందీల విడుదల జరుగుతుందని హమాస్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందంలోని నిబంధనలు, షరతుల అమలుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి, కైరోలో ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులతో తమ ప్రతినిధి బృందం చర్చలు జరిపినట్లు హమాస్ తెలిపింది.
గాజాకు తిరిగి వచ్చిన తమవారికి ఇళ్లు కల్పించడం, అత్యవసరంగా శిబిరాలు (కారవాన్) తెప్పించడం, భారీ పరికరాలు, వైద్య సరఫరాలు, ఇంధనం, ఆహారం, ఇతర సహాయ సదుపాయాలకు సంబంధించిన ప్రతీదీ ఒప్పందంలో పేర్కొన్న విధంగానే అమలు కావడంపై చర్చించామని తెలిపింది. చర్చలు సానుకూల వాతావరణంలోనే సాగాయని, ఇవన్నీ అమలు కావడంలో ఎదురయ్యే అడ్డంకులు, అభ్యంతరాలను తొలగించేందుకు కృషి చేస్తామని మధ్యవర్తులు హామీ ఇచ్చారని తెలిపింది. కాగా హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ వెంటనే ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
కాగా, గాజాలోకి మొబైల్ ఫోన్లు, లేదా భారీ యంత్రాలు, పరికరాలు ప్రవేశించడానికి వీల్లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ప్రతినిధి ఒమర్ దోస్త్రి అన్నారు. ఇందుకోసం తమ మధ్య ఎలాంటి సమన్వయం లేదని చెప్పారు. పైగా ఒప్పందం ప్రకారం రాఫా క్రాసింగ్ ద్వారా ఎలాంటి వస్తువులు కూడా గాజాలోకి ప్రవేశించరాదని దోస్త్రి చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
గత 16మాసాలుగా జరుగుతున్న దాడుల్లో గాజాలో మరణించిన వారి సంఖ్య 48,239 కాగా, గాయపడిన వారి సంఖ్య 1,11,676గా గాజా ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ప్రభుత్వ మీడియా కార్యాలయం మృతుల సంఖ్యను సవరించింది. మరణించిన వారి సంఖ్యను 61,709గా పేర్కొంది. శిధిలాల కింద చిక్కుకుపోయి అదృశ్యమైన వారుగా లెక్కిస్తూ వచ్చిన వేలాదిమందిని ఇక మృతులుగా లెక్కగట్టినట్లు మీడియా కార్యాలయం పేర్కొంది.
24 గంటల్లో గాజాలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హమాస్‌తో చేసుకున్న ఒప్పందాలతో ఇప్పటి వరకు సగం కన్నా ఎక్కువ మంది బందీలను విడుదల చేయడం జరిగింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 90 శాతం ప్రజలు నిరాశ్రయులయ్యారు. గాజా ప్రాంతం చాలా వరకు శిథిలమైంది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?