ఫిబ్రవరి 14న అమరవీరులను స్మరించుకుందాం

ఫిబ్రవరి 14న  అమరవీరులను స్మరించుకుందాం

* వాలెంటెన్స్ డే మాత్రమే కాదు .. పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం

“ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలెంటెన్స్ డే మాత్రమే కాదు.. దేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం” అని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు పేర్కొన్నారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తూ,  వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి 14న నిర్వహించుకోవాలని ఆ సంస్థల నేతలు యువతకు విజ్ఞప్తి చేశారు.

గురువారం మీడియా సమావేశంలో ఫిబ్రవరి 14న అమరవీరుల సంస్కరణ దివాస్ గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముక్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ (భాగ్యలక్ష్మి)  విభాగ్ కార్యదర్శి కళ్లెం రాజేందర్ రెడ్డి, విభాగ్ సహ కార్యదర్శి గిరిధర్ , భాగ్యనగర్ బజరంగ్దళ్ కన్వీనర్ అఖిల్ మాట్లాడారు.  విదేశీ ముష్కరుల చేతిలో వీరమరణం పొందిన  జవాన్ల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువకులు, విద్యార్థులు భరతమాత సేవలో తరించాలని సూచించారు.

ప్రేమ ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి, బుద్ధితో వ్యవహరించాలని హితవు చెప్పారు.  2019 ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఫిబ్రవరి 14న అమరవీరులను స్మరించుకుందామని పిలుపిచ్చారు. భాగ్యనగర్ లోని అబిడ్స్ సెంటర్లో శుక్రవారం ఉదయం అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో వాలెంటెన్స్ డే వంటి అపవిత్ర కార్యక్రమాలకు తావు లేదని వారు స్పష్టం చేశారు. వాలంటైన్స్ డే పేరుతో యువత స్పృహను కోల్పోయి వ్యవహరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. భారతీయ జీవన విధానము, కుటుంబ విలువలను కాపాడుకుంటూ.. అన్యోన్యమైన దాంపత్య జీవితం గడపాలని పేర్కొన్నారు.

రాధాకృష్ణుల ప్రేమను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రేమికులకు సూచించారు. విలువలతో కూడిన కుటుంబ జీవనం సాగాలంటే, పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు, అన్నదమ్ములు తమ పిల్లలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు గుర్తు చేశారు. పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్ విషయంలో పోలీసులు, డ్రగ్స్ నియంత్రణ అధికారులు, ఇతర యంత్రాంగం కూడా చాకచక్యంగా వ్యవహరించి యువతను మత్తు నుంచి దూరంగా ఉంచాలని  డిమాండ్ చేశారు.