
* విపక్షాలు వాకౌట్ .. వక్ఫ్ బిల్ కు రాజ్యసభ ఆమోదం
‘నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను నిర్మల కోరారు. లోక్‌సభ సెలెక్ట్ కమిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుల వివరాలు, దాని పనితీరుకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు. వారు నినాదాలు చేస్తుండగానే, బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానికి లోక్‌సభలోని మెజారిటీ సభ్యుల నుంచి స్పీకర్ ఆమోదాన్ని పొందారు. అనంతరం విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం నడుమ లోక్‌సభ సమావేశాలను మార్చి 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
నూతన ఆదాయపు పన్ను బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీ సమీక్షించి, దాని నివేదికను తదుపరి లోక్‌సభ సమావేశాల్లో మొదటి రోజున స్పీకర్‌కు సమర్పించనున్నారు. ‘నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025’ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం వల్ల, 60 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ‘ఆదాయపు పన్ను చట్టం-1961’ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ముందడుగు పడింది. నూతన చట్టాన్ని ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అని పిలువనున్నారు. దీన్ని 2026 సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.
పన్ను చట్టాలను ప్రతీ ఒక్కరు సులభంగా చదివి, అర్థం చేసుకులా సరళమైన భాషలో నూతన ఆదాయపు పన్ను బిల్లుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న ‘మదింపు సంవత్సరం’ (అసెస్‌మెంట్ ఈయర్), గత సంవత్సరం (ప్రీవియస్ ఈయర్) లాంటి పదాలను తొలగించి, వాటి స్థానంలో ట్యాక్స్ ఈయర్ (పన్ను సంవత్సరం) అనే పదాన్ని చేర్చారు. ఇక సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ వక్ఫ్ సవరణ బిల్లుపై తాము రూపొందించిన నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
మరోవంక, ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బిజెపి ఎంపీ సంజరు తదితరులు ఈ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. నివేదికపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. తాము సమర్పించిన డిస్సెంట్ (అసమ్మతి) నోట్‌ను తొలగించారంటూ నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. ఈ నిరసనల మధ్యే ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
కాగా, జనవరి 29న ముసాయిదా నివేదికను జెపిసి ఆమోదించిన విషయం తెలిసిందే. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ సవరణలతో వక్ఫ్‌బోర్డులలో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లుపై ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదింపజేసుకుంది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు