
తెలంగాణాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట ‘నోటా’తో ఎన్నిక నిర్వహించాలనే ప్రతిపాదన ఈసారి అమలులోకి రావడం లేదని తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది.
ఈ తరహా విధానం ఇప్పపటికే పలు రాష్ట్రాలు పాటిస్తున్న నేఫథ్యంలో రాష్ట్రంలోనూ ఈ విధానం అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం సేకరించింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశం ఇంకా చర్చల దశలో ఉండటంతో ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో నోటాతో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రా యాలు వ్యక్తమయయాయి.
ఈ సమావేశంలో నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశం అని అభిప్రాయ పడింది. ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే నోటాతో ఎన్నిక నిర్వహించాలని సూచించింది.
అయితే, బిఆర్ఎస్ స్పందిస్తూ ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని, నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఇక్కడ నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని బిజెపి భావించింది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్ణయానికి అధికారం లేదని పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని ఎస్ఇసి పేర్కొంది.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కొన్ని చోట్ల బలప్రయోగాలు, ప్రలోభాలు జరుగుతున్నాయని నోటాతో ఎన్నిక పెట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి ఎన్జీవోలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా విధానాలను పరిశీలించింది.
ఆ మూడు రాష్ట్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన అమల్లో ఉంది. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం మళ్లీ ఎన్నిక నిర్వహించకుండా రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించేలా అక్కడి రూల్స్ ఉన్నాయి. రాజకీయ పార్టీల నేతలు సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయనిపుణుల సూచనలు కూడా స్వీకరించనుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకొని అవసరమైన చట్టసవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఎస్ఈసీ భావిస్తోంది.
More Stories
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం