అక్రమ వలసదారులపై ట్రంప్ బాటలో యూకే కొరడా

అక్రమ వలసదారులపై ట్రంప్ బాటలో యూకే కొరడా
అమెరికా బాటలోనే పయనిస్తున్న బ్రిటన్ కూడా అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ వలసదారులను నియమించుకునే వ్యాపార సంస్థలపై ఇటీవల కాలంలో నిర్వహించిన రెయిడ్‌లు విజయవంతం అయ్యాయయని అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసల విభాగం అధికారులు ఏకంగా 5 వేల సార్లు రెయిడ్లు నిర్వహించారని పేర్కొంది. 
 
అక్రమ వలసదారులకు పని కల్పించే నెయిల్ బార్స్, షాపులు, వేప్ షాపులు, రెస్టారెంట్లు, కార్ వాష్ షాపుల్లో మెరుపు తనిఖీలు నిర్వహించి 4 వేల అరెస్టులు చేసినట్లు పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే అధికంగా అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఈ కాలంలో మొత్తం 16 వేల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు కూడా వెల్లడించింది. 
 
అక్రమ వలసదారులను సొంత దేశాలకు తరలిస్తున్న వీడియో ఒకటి విడుదల చేద్దామని యూకే ప్రభుత్వం భావిస్తుండగా అప్పుడే విమర్శలు మొదలయ్యాయి
మరోవైపు, అక్రమవలసలపై ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని యూేీ హోమ్ ఆఫీస్ మినిస్టర్ ఆంజెలా ఈగల్ సమర్థించుకున్నారు.  ‘‘నిబంధనలను గౌరవించి అమలు చేసే వ్యవస్థ బ్రిటన్‌లో ఉంది. నిబంధనల అమలు అందరికీ స్పష్టంగా కనిపించడం కూడా ముఖ్యమే. యూకేపై ఆశలతో అక్రమంగా ఇక్కడకు వచ్చే వారి భవితవ్యం ఏమిటో తెలిసేలా సందేశం పంపించాలి’’ అని ఆమె పేర్కొన్నారు.

బ్రిటన్‌లో సులువుగా బతుకుతెరువు లభిస్తుందన్న భావన అక్రమ వలసదారులను యూకేవైపు ఆకర్షిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించే సంస్థలు, వ్యాపారాలను టార్గెట్ చేస్తోంది. గతేడాది ఇంగ్లిష్ ఛానల్ దాటి 38 వేల పైచిలుకు మంది బ్రిటన్‌లో ప్రవేశించారు. ఈ ప్రమాదకర ప్రయాణంలో మరో 70 మంది అసువులు బాసారు.

అక్రమ వలసల వెనకున్న క్రిమినల్ గ్యాంగులు ప్రపంచ భద్రతకు ప్రమాదమని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. ఈ గ్యాంగులు ఉగ్రవాదులతో సమానమని వ్యాఖ్యానించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసే బిల్లు పార్లమెంటు ముందుకు రాగా వలసలకు అడ్డుకట్ట వేసేలా ఈ చట్టంలో అనేక కఠిన నిబంధనలను చేర్చారు. 

లేబర్ పార్టీకి సభలో ఉన్న మెజారిటీ రీత్యా ఈ బిల్లు సులభంగా పాసవుతుందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉగ్రవాద చర్యల అడ్డుకట్టు వినియోగించే కఠిన నిబంధనలు ఇతర నేరాలపై ప్రయోగించడం విపరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాయి.