
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ నియమాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు చెప్పారు. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.
అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వైసీపీ నేతలు మాటలు వింతగా ఉన్నాయని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తారో, తనకూ అంత సమయం ఇవ్వాలని జగన్ అడుగుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. అసలు జగన్ కు ప్రతిపక్ష నేత హోదాయే లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీ నియమ నిబంధనలు తెలుసుకోవాలని హితవు పలికారు.
ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీ రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అయ్యన్న వెల్లడించారు. నిర్దిష్ట కారణం వల్ల అసెంబ్లీకి రాలేకపోతున్నాను అంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వాలని, సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారని వివరించారు.
సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలాగని, అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని స్పష్టం చేశారు. వైసీపీలో మిగతా ఎమ్మెల్యేలకు జగన్ మాట్లాడే అవకాశం ఇవ్వాలని, వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని అయ్యన్న సూచించారు.
సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని జగన్ ను, వైసీపీ నేతలను కోరుతున్నానని తెలిపారు. అసెంబ్లీకి హాజరుకావాలంటూ తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు సూచించానని ఆయన గుర్తు చేశారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా.. తన ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడుతోన్నారని విచారం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తాము నిర్ణయించామని, అయితే ఈ లోపే ఎమ్మెల్యేలకు విజయవాడలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 174 మందిలో 84 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై… అసెంబ్లీలో అడుగు పెట్టారని తెలిపారు.
ఈ నేపథ్యంలో వారందరికీ చట్ట సభల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తే బావుంటుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తాము వివరించామని చెప్పారు. వీటిని రెండు రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో నిర్వహిస్తామని, . వీటికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 61 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని చెబుతూ ఏడాదికి కనీసం..75 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము భావిస్తున్నామని స్పీకర్ తెలిపారు. అప్పుడే శాసన సభ్యులు అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే తాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హైదరాబాద్ నగర శివారులోని గండిపేట వద్ద 7 రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించారని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు