శ్రీలంక నేవీ అదుపులో 14 మంది తమిళ మత్స్యకారులు

శ్రీలంక నేవీ అదుపులో 14 మంది తమిళ మత్స్యకారులు

తమిళనాడుకు చెందిన 14 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. రెండు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. రామనాథపురం తీరప్రాంత జిల్లాకు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక నేవీ తెలిపింది. పాక్‌బే జలసంధిలో వేటాడుతున్నందున వారిని అరెస్ట్‌ చేశామని, చట్టపరమైన చర్యల కోసం వారిని నేవీ పోర్ట్‌కు తరలించినట్లు పేర్కొంది.

15 రోజుల్లోపే, 50 మందికి పైగా మత్స్యకారులను అరెస్ట్‌ చేశారని, సోమవారం సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని మత్స్యకార సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. శ్రీలంక ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాల్సి వుందని, ఇదే సమస్యకు శాశ్వత పరిష్కారమని వారు చెప్పారు.

 శ్రీలంక ప్రభుత్వం మత్స్యకారులను అరెస్ట్‌ చేయడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. మత్స్యకారుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఇటీవల రామేశ్వరం బస్టాండులో భారీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

శ్రీలంక ఉత్తరప్రావిన్స్‌లోని మత్సకారుల సంఘాలతో తమిళనాడు మత్సకారులతో నేరుగా చర్చలు జరిపేలా ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. శ్రీలంక ప్రభుత్వం వారంలో మూడు రోజులు కచ్చ దీవుల్లో వేటాడేందుకు అనుమతించాలని చెప్పారు. ఈ మేరకు ఇరు ప్రభుత్వాలు 50 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవల కాలంలో శ్రీలంక ప్రభుత్వం తమిళనాడు మత్సకారులను అరెస్ట్‌ చేయడమే కాకుండా రూ.50,000 నుండి రూ.2,00,000 శ్రీలంక రూపాయలు) జరిమానా విధిస్తోందని,  ‘రిపీట్‌ అఫెండర్‌’ పేరుతో ఆరు నెలల నుండి 24 నెలల వరకు జైలులో నిర్బంధిస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు.