
* భక్తులకు సారీ చెప్పిన మంత్రి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు నిత్యం భారీగా భక్తులు తరలి వస్తుంటారు. దుర్గమ్మను దర్శించుకుని ఆలయంలో అందజేసే ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అయిత విజయవాడ దుర్గ గుడి ప్రసాదంలో వెంట్రుకలు కనిపించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఓ భక్తుడికి ఇలాంటి అనుభవం ఎదురు కాగా, సదరు భక్తుడు సోషల్ మీడియాలో దీనిని పోస్ట్ చేశారు. విజయవాడ దుర్గ గుడి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదని ఆరోపించారు. ఉదయం ఓ లడ్డూలో తనకు వెంట్రుక కనిపించిందని, తన భార్య కొనుగోలు చేసిన మరో లడ్డూలోనూ వెంట్రుకలు కనిపించడంతో తాను నిర్ఘాంతపోయినట్లు ట్వీట్ చేశారు.
లడ్డూకు సంబంధించిన ఫోటోలను అందుకు జతచేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డిలను ట్యాగ్ చేశారు. దుర్గ గుడి లడ్డూలపై భక్తుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో భక్తుడి ఫిర్యాదుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. భక్తుడికి క్షమాపణ తెలియజేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భక్తుడికి హామీ ఇచ్చారు. త్వరలోనే ఆలయం కిచెన్‌ను తాను సందర్శిస్తానని, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
మరోవైపు విజయవాడ దుర్గ గుడిలో తాగునీటి సమస్యపైనా గత నెలలో కొంతమంది భక్తులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై నారా లోకేష్ సత్వరమే స్పందించడంతో సమస్య పరిష్కారమైంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు