తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అదుపులో నలుగురు

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అదుపులో నలుగురు

తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ చేపట్టిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నెయ్యి సరఫరా చేసిన సంస్ధలకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. 

తమిళనాడుకు చెందిన ఏఆర్‍ డైయిరీ, ఉత్తరప్రదేశ్​కు చెందిన పరాగ్‍ డైయిరీ, ప్రీమియర్‍ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్ధలకు సంబంధించిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తోంది. విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమవడంతో అరెస్టు చేయనున్నారు.

ప్రీమియర్‍ అగ్రి ఫుడ్స్, పరాగ్‍ డైయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్‍ డైయిరీకి సంబంధించిన విపిన్‍ గుప్త, పోమిల్‍ జైన్‍, అపూర్వ చావ్డా, రాజశేఖర్​లను అదుపులోకి తీసుకుంది. కల్తీ నెయ్యి సరఫరాలో ఏఆర్‍ డైయిరీకి సహకరించిన సంస్ధల ప్రతినిధులను విచారించిన సీబీఐ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. 

శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల ఆవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారిన వ్యవహరంపై పూర్తిస్థాయి విచారణ కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. 

సీబీఐ హైదరాబాద్‍ డివిజన్‍ జాయింట్‍ డైరెక్టర్‍ వీరేశ్‍ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డీఐజీ గోపినాథ్‍ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్‍ఎస్‍ఎస్‍ఏఐ అధికారి సత్యకుమార్‍ పాండా ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. గత ఏడాది నవంబర్​లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ నిర్వహించింది. 

ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు తిరుమల, తిరుపతితో పాటు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్‍ ప్రాంతంలో ఉన్న ఏఆర్‍ డైయిరీలో విచారణ నిర్వహించారు. మూడు రోజులుగా దర్యాప్తు బృందం సభ్యుడు సీబీఐ జాయింట్‍ డైరెక్టర్‍ వీరేశ్‍ ప్రభు తిరుపతిలో మకాం వేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్‍ డైయిరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన పలు డైయిరీ సంస్ధల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించిన సీబీఐ బృందం, ఏఆర్‍ డైయిరీకి సహకరించిన సంస్ధల ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తోంది.

విచారణకు పూర్తిగా సహకరించకపోవడం, ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు అదుపులో ఉన్న నలుగురు కల్తీ నెయ్యి సరఫరాలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన సీబీఐ వారిని కోర్టులో హజరుపరచనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.