అణు ఇంధన చట్టాన్ని సవరిస్తాం

అణు ఇంధన చట్టాన్ని సవరిస్తాం
 
* అమెరికా, ఫ్రాన్స్‌ కంపెనీల పెట్టుబడులకు మార్గం 
 
అణు బాధ్యతా చట్టాన్ని, అణు ఇంధన చట్టాన్ని సవరిస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా, ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. అణు ఇంధన రంగంలో ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకుంటున్న   కేంద్రం నిర్ణయం అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల అణు ఇంధన కంపెనీలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. 
 
ఎందుకంటే వాటి ప్రాజెక్టుల విషయంలో గత పదిహేను సంవత్సరాలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చట్టపరమైన చిక్కులే దీనికి కారణం. కొందరు నిపుణులు ప్రతిపాదిత సవరణలపై మరింత స్పష్టత కోరుతున్నారు.
2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరికి ఈ నెల 1న బడ్జెట్‌ సమర్పణ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటన పూర్తి భిన్నంగా ఉంది. 
 
మహారాష్ట్రలోని జైతాపూర్‌ వద్ద ఆరు ఇపిఆర్‌ 1650 అణు విద్యుత్‌ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి 2009తో ఎలక్ట్రిసైట్‌ డి ఫ్రాన్స్‌ (ఇడిఎఫ్‌)తో అవగాహనా ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఆరు ఎపి 1000 అణు విద్యుత్‌ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ (డబ్ల్యూఇసి)తో కూడా 2012లో ఎంఓయూ కుదిరింది. 
 
చట్టపరమైన అవరోధాల కారణంగా రియాక్టర్ల నిర్మాణం ముందుకు సాగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అడుగు ముందుకు పడుతుందని చెబుతున్నారు. లక్ష్య సాధన కోసం ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అని, అందుకే అణు ఇంధన చట్టాన్ని, అణు నష్టానికి సంబంధించిన పౌర బాధ్యతా చట్టాన్ని సవరించాలని నిర్ణయించామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. 
 
అణు విపత్తు సంభవించినప్పుడు జరిగే నష్టానికి బాధితులకు పరిహారం అందేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం. ఆ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా చట్టం నిర్దేశిస్తుంది. చట్టంలోని ఈ నిబంధనల కారణంగా విదేశీ కంపెనీలు మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వెనుకాడుతుండటంతో వీటిని సవరించాలని నిర్ణయించామని చెబుతోంది. 
 
2047 నాటికి కనీసం 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2033 నాటికి ఐదు స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల (ఎస్‌ఎంఆర్‌)తో ఉత్పత్తి ప్రారంభించడానికి రూ.20,000 కోట్లు కేటాయించింది. మన దేశం వద్ద ప్రస్తుతం 22 రియాక్టర్లు ఉన్నాయి. వాటి ద్వారా 6,780 మెగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
 
ప్రస్తుతం రష్యాకు చెందిన రొసాటమ్‌ కంపెనీ మాత్రమే మన దేశంలో అణు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత చట్టంలోని నిబంధనలు ఆమోదయోగ్యం కావని పశ్చిమ దేశాలకు చెందిన అంతర్జాతీయ అణు విద్యుత్‌ కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. అణు విద్యుదుత్పత్తికి సంబంధించిన విడిభాగాలను సరఫరా చేసే వారిపై ఈ చట్టం అధిక బాధ్యత మోపుతోందని వాటి వాదన. 
 
2012లో పార్లమెంటులో వాడి వేడి చర్చ జరిగిన అనంతరం ఈ నిబంధనలను చట్టంలో చేర్చగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్‌డిఎ సభ్యులు వ్యతిరేకించారు. బాధ్యత నుండి పశ్చిమ దేశాలను తప్పించేందుకే ఈ నిబంధనను తెచ్చారని విమర్శించారు. ఆ సందర్భంగా యూనియన్‌ కార్బైడ్‌ – భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ కేసు, జపాన్‌ తీరంలో సంభవించిన సునామీ కారణంగా జరిగిన ఫుకుషిమా అణు లీకేజీ ఘటన చర్చకు వచ్చాయి. 
 
అంతర్జాతీయ సరఫరాదారులు సమస్యలు ఎదుర్కొంటారని తెలిసి కూడా ప్రతిపక్షాలను సంతృప్తి పరచడానికి 2010లో చట్టాన్ని సవరించారని మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్‌ చరణ్‌ తెలిపారు. ‘ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేస్తుందో తెలియదు. అంతర్జాతీయ భాగస్వాములను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి’ అని పేర్కొన్నారు.