చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ లకు దూరంగా ఉండండి

చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ లకు దూరంగా ఉండండి

చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌, గూగుల్, జెమిని వంటి విదేశీ ఏఐ యాప్‌ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ పనిని సులభంగా, వేగంగా పూర్తిచేయడానికి ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. 

ఎందుకంటే ఏఐ యాప్స్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్‌ను తప్పక అనుమతించాల్సిందే. ఇది  ఏఐ టెక్నాలజీ  యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే తమ ఉద్యోగులు ఛాట్ జీపీటీ, డీప్ సీక్ ఇక మీదట వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థికశాఖ.

ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతోనే ఈ ఆర్థికశాఖ అల్టిమేటం జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.  అయితే ఆర్థిక శాఖ అంతర్గతంగా విడుదల చేసిన ఈ అడ్వైజరీ నిజమేనని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక శాఖ మాత్రమే ఇటువంటి అల్టిమేటం ఇచ్చిందా? లేక మిగతా శాఖలు కూడా ఇచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. 
 
భారత్‌ మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు వాటిల్లొచ్చనే ఆందోళనతో డీప్‌సీక్‌పై ఆంక్షలు విధించాయి. ఓపెన్‌ ఏఐకి చెందిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ, చైనాకు చెందిన డీప్‌ సీక్‌ రెండూ అన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో చాట్‌జీపీటీ సంచలనం సృష్టించింది. 
 
అయితే చాట్‌జీపీటికి పోటీగా వచ్చిన డీప్‌సీక్‌ ఆర్‌1.. ఏఐ చాట్‌బాట్స్‌ ప్రపంచంలో మరో సంచలనం స ష్టించింది.  అమెరికాలో యాప్‌ స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్స్‌లో డీప్‌సీక్‌ ప్రథమస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతోంది.  భారత్‌ కూడా సొంత ఏఐ మోడల్‌ను ఈ ఏడాదిలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు. చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినై, మెటా ఏఐ, డీప్‌సీక్‌ ఆర్‌1 వంటి సంస్థలకు ధీటుగా ఈ మోడల్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.