నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వాడి వేడి చర్చలకు అటు ప్రతిపక్షం, దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సంసిద్ధమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సమర్పిస్తారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ ఒక విడత, మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. మహా కుంభమేళాలో తొక్కిసలాట, 30 మందికి పైగా మృతి ఘటన పై కచ్చితంగా పార్లమెంటులో చర్చించి తీరాలని ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీర్మానించుకున్నాయి. 

అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై దాడికి దిగాలని కూడా విపక్షాలు సిద్ధమయ్యాయి. కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లుతో సహా మూడు కొత్త బిల్లులను, మొత్తం మీద బడ్జెట్ సమావేశాల్లో 16 బిల్లులకు సభ ఆమోదముద్ర పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాటిలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ఇమిగ్రేషన్, విదేశీయుల బిల్లు మరీ ముఖ్యమైనవి.

వక్ఫ్ సవరణ బిల్లుపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుల సంయుక్త కమిటీ చర్చించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తన నివేదికను  గురువారం సమర్పించింది.  ప్యానెల్ ఛైర్‌పర్సన్ జగదాంబికా పాల్ పార్లమెంట్ కార్యాలయంలో బిర్లాను కలుసుఉని ఈ నివేదికను అందజేశారు.  నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ప్రభుత్వం పలు సవరణలతో ఆమోదింపజేసుకునేందుకు సన్నద్ధమైంది. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును కూడా ప్రవేశపెట్టారు ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను సిద్ధం చేసింది.

అవి విమానాల వస్తువులలో పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకరి విశ్వవిద్యాలయ బిల్లు, ’ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ బిల్లు’. అలాగే 2025 ఫైనాన్స్ బిల్లు, గ్రాంట్స్ ఇతర బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరో పది బిల్లులు గత సమావేశాల నుంచీ సభ ఆమోదానికి రెడీగా ఉన్నాయి.

పార్లమెంట్‌ భవనంలో గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజిజు, జె.పి.నడ్డా, అర్జుర్‌రామ్‌ మేఘ్వాల్‌, ఎల్‌.మురుగన్‌లు అధ్యక్షత వహించారు. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులను  ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.  

ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేష్‌,  కె. సురేష్‌,  గౌరవ్‌ గొగోయ్,  టిఎంసి ఎంపిలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరెకె ఒబ్రెయిన్‌, ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌,  బిజెడి ఎంపి సస్మిత్‌ పాత్ర, డిఎంకె ఎంపి టి.ఆర్‌.బాలు, ఎస్‌పి ఎంపి రామ్‌గోపాల్‌యాదవ్‌,  జెఎంఎం ఎంపి మహువా మాజి సహా పలువురు ఎంపిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.