తెలుగు రాష్ట్రాల్లో ఊరి నుంచే కుంభమేళాకు బస్సు

తెలుగు రాష్ట్రాల్లో ఊరి నుంచే కుంభమేళాకు బస్సు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళలో  నిత్యం కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. అందుకోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఈ కుంభమేళకు తరలి వస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మహా కుంభమేళ ఫిబ్రవరి 14వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సైతం ఈ మహా కుంభమేళకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి, అంటే మారుమూల ప్రాంతాల నుంచి సైతం ఈ మహా కుంభమేళలో పాల్గొనాలనుకొంటున్న భక్తులకు ఈ మహాదవకాశం కల్పించనుంది. అయితే కుంభమేళకు 40 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పని సరిగ్గా ఉండాల్సి ఉంటుంది. అలా వారు తమ పరిధిలోని బస్సు డిపోకు చెందిన ఉన్నతాధికారులను సంప్రదిస్తే చాలని అంటున్నారు.

ఈ మహా కుంభమేళకు వెళ్లి రావాలంట ఒక్కొక్కరికి రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతోందని, భోజనాలు, టిఫిన్లు అన్ని ఆర్టీసీ వారే సమకూరుస్తాని చెబుతున్నారు. దీనిపై డిపో ఉన్నతాధికారులతో ముందుగానే సంప్రదిస్తే కండిషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేసి, అదనపు సిబ్బందిని సైతం ఏర్పాటు చేసే అవకాశముంది.

ఓ వేళ ఈ మహాకుంభమేళకు వెళ్లే ప్రయాణికులు చాలా స్వల్పంగా ఉంటే, ఆ సమీపంలోని ఊళ్ల నుంచి ప్రయాణికులను సైతం బస్సులో ఎక్కించుకోవాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు మహాకుంభమేళలో మౌని అమావాస్య సందర్బంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణించారు. అలాగే దాదాపు 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రయాగరాజ్‌కు వెళ్ల వలసిన ప్రత్యేక రైళ్లను ఆపి వేశారు. దీంతో ప్రయాగరాజ్‌కు వెళ్ల వలసిన ప్రయాణికులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ మహా కుంభమేళకు చేరుకొంటున్నారు. 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది. దీంతో ఈ కుంభమేళలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మహాకుంభమేళకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చలి అధికంగా ఉంటుంది. దీంతో మందపాటి దుప్పట్లు తీసుకు వెళ్లాల్సి ఉంది. అలాగే ధీర్ఘ కాల అనారోగ్య సమస్యలతో బాధపడుతోంటే మందులు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

కుటుంబంలో ఒకరిద్దరు వెళ్తుంటే ఆయా ప్రాంతాల్లోని వారు ఒక గ్రూప్‌గా ఏర్పడి వెళ్లితే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు వారిలోని వారు వెంటనే స్పందించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలిగే ఆస్కారం ఉంటుంది.