కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి

* బారీకేడ్లను తొలగించడంవల్లే తొక్కిసలాట             * న్యాయవిచారణకు ఆదేశం

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారని, మరో 60 మంది గాయపడ్డారని మహాకుంభ్ డీఐజీ వైభవ్‌ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించాల్సి ఉందని డీఐజీ చెప్పారు. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట రెండు గంటల మధ్య తొక్కిసలాట జరిగిందని ఆయన వెల్లడించారు.  మౌని అమావాస్య నేపథ్యంలో భక్తులు ఊహించిన దానికింటే అధిక సంఖ్యలో పుణ్య స్నానాలకు తరలివచ్చారని, రద్దీ పెరగడంతో పలుచోట్ల బారీకేడ్లను తొలగించారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని వైభవ్‌ కృష్ణ తెలిపారు.
 
 ‘మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో అమృతస్నానం ఆచరించే ఉద్దేశంతో ప్రజలు భారీగా గుమిగూడారు. రద్దీ కారణంగా బారికేడ్లు విరిగిపోయాయి. దీనితో అర్థరాత్రి 1-2 గంట్ల మధ్య ఈ తొక్కిసలాట జరిగింది. సుమారు 90మంది క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించగా, దురదృష్టవశాత్తు 30 మంది భక్తులు మరణించారు. మరో 60 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మృతుల్లో 25 మందిని గుర్తించాం’ అని మహాకుంభ్ డీఐజీ పేర్కొన్నారు.
 
మహా కుంభమేళాలో తొక్కిసలాటలో మృతి చెందిన వారిపై ఆధారపడిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. మాజీ న్యాయమూర్తి హర్ష్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన దర్యాప్తు కమిటీలో మాజీ న్యాయమూర్తి వికె గుప్తాతోపాటు రిటైర్డ్‌ ఐఎఎస్‌ బికె సింగ్‌ కూడా ఉంటారని సిఎం తెలిపారు. ఈ సంఘటన ఎందుకు జరిగిందన్న అంశంపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.
 
అదనపు వివరాల కోసం హెల్ప్లైన్ 1920ను సంప్రదించవచ్చని డిజిజి సూచించారు. కాగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని ఆయన తెలిపారు. తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలను కొంతసేపు నిలిపివేశారు. తొక్కిసలాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డవారిని అంబులెన్సుల్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవటం వల్ల ఆసుపత్రి రద్దీగా మారింది. మహా కుంభమేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కారు హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. ‘అఖాడాల కోసం ఏర్పాటు చేసిన మార్గంలోని బ్యారికేడ్లను కొందరు భక్తులు ఎక్కటంతో తొక్కిసలాట జరిగినట్లు’ యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ తెలిపారు. మృతులు కర్ణాటక, గుజరాత్‌, అసోం సహా పలు రాష్ట్రాలకు చెందినవారని మహాకుంభ్ డీఐజీ వెల్లడించారు.
 
ఘాట్‌ల వద్దకు దారి తీసే మార్గాల్లో చెత్త డబ్బాలు పెట్టారని, కానీ తెల్లవారు జామున ఆ చీకట్లో చెత్త డబ్బాలు కనిపించకపోవడంతో కాళ్లకు తగిలి పడిపోయారని, అదే తోపులాటకు దారి తీసిందని పలువురు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
 

అయితే,  రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, విఐపి సంస్కృతి కారణంగానే తొక్కిసలాట జరిగిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరాయి. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తంచేశారు. గాయపడివారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. 

కాగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకే మహా కుంభమేళాకు విచ్చేసిన భక్తుల సంఖ్య 5.71 కోట్లు దాటిందని, సాయంత్రంకు 8 కోట్లు దాటవచ్చని అంచనావేశారు. అదేవిధంగా జనవరి 28 వరకు మొత్తం 16 రోజుల్లో కుంభమేళాకు హాజరైన భక్తుల సంఖ్య 19.94 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్‌ సమాచార శాఖ తెలిపింది. మహా కుంభమేళా ముగిసేనాటికి భక్తుల సంఖ్య 50 కోట్లు దాటే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.