నివాస ఆధారిత వైద్య సీట్ల కేటాయింపు తిరస్కారం

నివాస ఆధారిత వైద్య సీట్ల కేటాయింపు తిరస్కారం

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులకు రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత సీట్ల కేటాయింపును సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.  ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌14ని  ఉల్లంఘించడమేనని తీర్పునిచ్చింది. 

 భారతదేశ పౌరులుగా, నివాసితులుగా ఎక్కడైనా నివాసాన్ని ఎంచుకునే హక్కు మనకి ఉందని, అదేవిధంగా భారతదేశంలోని విద్యాసంస్థల్లో ఎక్కడైనా అడ్మిషన్‌ను ఎంచుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని జస్టిస్‌ హృషికేష్‌ రాయ్, జస్టిస్‌ సుదాన్షు ధౌలియా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

”మనమంతా భారత దేశ నివాసులం. ఏ ప్రాంతం, ఏరాష్ట్రం అన్న ప్రశ్న తలెత్తకూడదు. భారతదేశంలో ఎక్కడైనా నివాసాన్ని ఎంచుకునే హక్కు ఉంది. దేశంలో ఎక్కడైనా వ్యాపారం, వృత్తిని నిర్వహించే హక్కు మనకు ఉంది” అని కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఎంచుకునే హక్కుని కూడా రాజ్యాంగం కల్పించిందని తెలిపింది.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో మాత్రమే నిర్దిష్ట రాష్ట్రంలో నివసించే వారికి రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని కోర్టు అంగీకరించింది. ప్రత్యేక విభాగంలో శిక్షణ పొందిన వైద్యుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటే నివాస ప్రాతిపదికన ఉన్నత స్థాయిలలో రిజర్వేషన్లు ఆర్టికల్‌ 14ని ఉల్లంఘించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.

అయితే నేటి తీర్పు ఇప్పటికే మంజూరు చేసిన నివాస ఆధారిత రిజర్వేషన్లపై ప్రభావం చూపదని, అటువంటి ఈ కేటాయింపుల ఆధారంగా పిజి పూర్తి చేసిన విద్యార్థులు  కూడా ప్రభావితం కారని కోర్టు పేర్కొంది.

పీజి మెడికల్‌ కోర్సులకు నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్‌- హర్యానా కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును పలువురు సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కానీ కేసు ప్రాముఖ్యత దృష్ట్యా ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేసింది.