
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కొంతమంది భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విరుద్ధంగా, నిజ్జర్ హత్యలో “విదేశీ హస్తం”తో “ఖచ్చితమైన సంబంధం” లేదని కెనడా కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యలో ఏ విదేశీ ప్రభుత్వ హస్తం ఉన్నట్టు ఆధారాలేవీ లభించలేదని కెనడా ప్రభుత్వం నిర్వహించిన ఓ విచారణ కమిటీ తేల్చింది.
ఈ కమిషన్ విడుదల చేసిన 123 పేజీల ‘ఫెడరల్ ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య సంస్థలలో విదేశీ జోక్యంపై ప్రజా విచారణ’ నివేదిక ఈ విషయంలో భారత్ కు సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఆధారాలు లేవని వెల్లడించింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నట్టు కెనడా ప్రధాని ట్రూడో అనుమానం వ్యక్తం చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
అయితే ట్రూడో ఆరోపణల తర్వాత భారత్ కెనడాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని సాగించిందని విచారణ కమిటీ తన నివేదికలో ఆరోపించింది. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వార వెలుపల నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అదే నివేదిక కెనడా ఎన్నికలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని కూడా ఆరోపించింది.
అయితే ఈ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. నివేదికకు ప్రతిస్పందనగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది: “ఉద్దేశించిన జోక్యంపై ఆరోపించిన కార్యకలాపాల గురించి మేము ఒక నివేదికను చూశాము. నిజానికి కెనడా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటుంది. ఇది అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు వాతావరణాన్ని కూడా సృష్టించింది. భారతదేశంపై నివేదికలోని సూచనలను మేము తిరస్కరిస్తున్నాము”.
“అక్రమ వలసలకు వీలు కల్పించే మద్దతు వ్యవస్థ ఇకపై ఆమోదించబడదని మేము ఆశిస్తున్నాము” అని భారత్ పేర్కొన్నది. ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతదేశం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పుడు భారతదేశం- కెనడా దౌత్య సంబంధాలలో చీలిక ఏర్పడింది. నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయాన్ని నిరూపించడానికి కెనడా వద్ద తగినంత ఆధారాలు ఉన్నాయని ఆయన చెబుతూ వచ్చారు. భారతదేశం ఈ వాదనలను “అసంబద్ధం” అని పేర్కొంటూ తీవ్రంగా తిరస్కరించింది.
పైగా, కెనడాలో నివసించే ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారుల పట్ల ట్రూడో ప్రభుత్వం మృదువుగా వ్యవహరిస్తోందని భారతదేశం పదే పదే విమర్శించింది. ఖలిస్తాన్ ఉద్యమం భారతదేశంలో నిషేధించబడింది కానీ సిక్కు ప్రవాసులలో, ముఖ్యంగా కెనడాలో మద్దతు ఉంది.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్