ట్రంప్ పై కేసు విచారించిన న్యాయవాదుల తొలగింపు

ట్రంప్ పై కేసు విచారించిన న్యాయవాదుల తొలగింపు

2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తనపై నమోదైన కేసు దర్యాప్తును ముందుకుతీసుకెళ్లిన అధికారులపై ట్రంప్‌ కక్ష సాధింపు చర్యతో వేటు వేశారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌ జేమ్స్‌ మెక్‌ హెన్రీతో పాటు, మరో 12 మంది అధికారులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీరిని విశ్వసించలేమని ఈ ఆదేశాల్లో ట్రంప్‌ పేర్కొనడం విశేషం. 

తొలగింపునకు గురైన వారిలో మాజీ స్పెషల్‌ కౌన్సిల్‌ జాక్‌ స్మిత్‌ కూడా ఉన్నారు. ట్రంప్‌ ఎన్నికల ఓటమి తర్వాత దర్యాప్తునకు జాక్‌ స్మిత్‌ నాయకత్వం వహించారు. ట్రంప్‌పై స్మిత్‌ రెండు దర్యాప్తులు చేశారు. వీటిలోభాగంగా ట్రంప్‌పై స్మిత్‌ నేరారోపణలు చేశారు. 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగా మార్చేందుకు యత్నించారన్నది దీనిలో ప్రధాన ఆరోపణ. 

దీంతోపాటు రహస్య పత్రాలను తనతోపాటు తీసుకెళ్లారన్నది మరో కేసు. అప్పట్లో ఈ దర్యాప్తులను ట్రంప్‌, ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లలో ట్రంప్‌ తన రాజకీయ శత్రువుల పదవులకు ఎసరు పెట్టారు. అప్పుడే స్మిత్‌ బృందంపైనా వేటు ఖాయమనే సంకేతాలు వచ్చాయి.

మరోవంక, అమెరికా మిలటరీని పునర్‌ వ్యవస్థీకరించాలని ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. దీంతోపాటు ట్రాన్స్‌జెండర్లు అమెరికా సాయుధ దళాల్లో పనిచేయకుండా నిషేధం విధించారు. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడానికి నిరాకరించి చర్యలకు గురైనవారిని మళ్లీ దళాల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు వస్తున్న సమయంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ఆయన ఈ ఆదేశాలపై సంతకం చేసినట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. 

2017లో కూడా ట్రంప్‌ ట్రాన్స్‌జెండర్లను సైనికదళాల్లో చేరకుండా నిషేధం విధించారు. అయితే, 2021లో జోబైడెన్‌ ఆ ఆదేశాలను నిలిపివేశారు. ట్రంప్‌ మళ్లీ అధికారం చేపట్టగానే బైడెన్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నారు. తాజాగా,  జారీ చేసిన ఆదేశాల్లో ట్రంప్‌ మరింత దూకుడు కనబర్చినట్లు తెలుస్తోంది.