వక్ఫ్‌ సవరణ బిల్లుకు జెపిసి ఆమోదం

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జెపిసి ఆమోదం
అధికార బీజేపీ సభ్యులు సూచించిన మార్పులతో కూడిన తన నివేదికను వక్ఫ్‌ సవరణ బిల్లును అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది. అయితే ఈ నివేదికను వ్యతిరేకిస్తున్న జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు ఇది వక్ఫ్‌ బోర్డులను నాశనం చేసే ప్రయత్నంగా అభివర్ణించారు. నివేదికపై తమ డిస్సెంట్‌ నోట్‌లో తీవ్ర అభ్యంతరాలను తెలియచేశారు. 
 
బీజేపీ సభ్యుడు జగదంబికా పాల్‌ అధ్యక్షతన వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై ఏర్పాటైన జేపీసీ బుధవారం 15-11 మెజారిటీ ఓటుతో ముసాయిదా చట్టానికి సబంధించిన నివేదికను ఆమోదించింది. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.
 
కమిటీ 28వ సమావేశం అనంతరం జగదంబికా పాల్‌ విలేకరులతో మాట్లాడుతూ 655 పేజీలతో కూడిన  తమ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పిస్తామని, శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలలో పార్లమెంట్‌ ఉభయ సభలలో దీన్ని ప్రవేశపెడతారని తెలిపారు.  
 
ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని.. బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్‌ బోర్డు తన విధులను మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తుల ప్రయోజనాలు పొందేవారి జాబితాలో తొలిసారి పస్మాందా ముస్లింలు, పేదలు, మహిళలు, అనాథలను చేర్చామన్నారు.
 
సోమవారం జరిగిన సమావేశంలో బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది.  నిరుడు ఆగస్టు 8న ఏర్పాటైన ఈ జేపీసీ ఢిల్లీలో 38 సమావేశాలు నిర్వహించింది. కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు.  అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్‌ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి. వక్ఫ్‌ అలాల్‌ ఔలాద్‌(కుటుంబ వక్ఫ్‌లు)లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి.