
శ్రీహరికోట నుండి బుధవారం ప్రయోగించిన జి ఎస్ ఎల్ వి- ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్ వి ఎస్ -02 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశ పెట్టారు. అనంతరం ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మీడియా సమావేశంలో పాల్గొంటూ త్వరలో ఇస్రో మూడు గగన్ యాన్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని తెలిపారు.
అందులో రెండు మానవరహిత ప్రయోగాలు కాగా, ఒకటి మాత్రం మానవ సహిత ప్రయోగం ఉంటుందని పేర్కొన్నారు. షార్ నుండి జరిపిన 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం దేశానికి గర్వకారణమని, భారత చరిత్రలో ఈ రోజు జరిగిన 100వ రాకెట్ ప్రయోగ విజయం చరిత్రాత్మకమైనది తెలిపారు.
వంద రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రోకు 46 ఏళ్లు పట్టింది. అయితే డబుల్ సెంచరీ మాత్రం మరో అయిదేళ్లలోనే పూర్తి కానున్నట్లు చెబుతూ రానున్న అయిదేళ్లలో మరో 100 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధంగా ఉన్నట్లు చైర్మెన్ తెలిపారు. గడిచిన 46 ఏళ్లలో.. 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపింది ఇస్రో. దీనితో పాటు 120 టన్నుల పేలోడ్ పంపించింది. దీంట్లో 433 విదేశీ శాటిలైట్లకు చెందిన 23 టన్నుల పేలోడ్ కూడా ఉన్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.
స్పేడెక్సు ప్రయోగం ద్వారా డాకింగ్ పరిశోధనను విజయవంతముగా నిర్వహించి ప్రపంచంలో భారత్ ను ఇస్రో నాలుగోవ దేశముగా నిలిపిందని చెప్పారు. 1979 లో మొదటి ఎస్ ఎల్ వి – 3 రాకెట్ ప్రయోగ విజయంతో ఇస్రో విజయాల పరంపరను ప్రారంభించి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ రకరకాల రాకెట్లను రూపొందిస్తూ వస్తుందని ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం భారత్‌కు నాలుగు రకాల నావిగేషన్ శాటిలైట్లు అందుబాటులో ఉన్నాయని, ఇవాళ జరిగిన ప్రయోగం అయిదోది అని, మరో మూడింటికి ఆమోదం వచ్చిందన్నారు. మరో అయిదారు నెలల్లో నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మెన్ నారాయణన్ తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికిల్స్(ఎన్‌జీఎల్వీ)ను ప్రయోగించేందుకు నిర్మాణం చేపట్టాలని కేంద్రం నుంచి ఇస్రోకు అనుమతులు వచ్చినట్లు నారాయణన్ తెలిపారు.
తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాల్లో ఘనమైన విజయాలు సాధించిన ఇస్రోకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్వీ) అత్యంత నమ్మకమైన, అచ్చొచ్చిన వాహకనౌక. ఇప్పటివరకు ఇస్రో వంద ప్రయోగాలు చేపట్టగా, అందులో 62 పీఎస్‌ఎల్వీ ద్వారానే చేపట్టింది. 17 ప్రయోగాలను జీఎస్‌ఎల్వీ ద్వారా చేపట్టింది. పీఎస్‌ఎల్వీ-డీ1 ద్వారా 1993 సెప్టెంబర్ 20న మొదటిసారి పీఎస్‌ఎల్వీ వాహకనౌకను ఇస్రో ప్రయోగించింది.
ఈ ప్రయోగం విఫలమైనా 1994లో విజయవంతమైన ప్రయోగంతో ఇస్రోకు పీఎస్‌ఎల్వీ అనేక విజయాలను అందించింది. కాగా, ఇస్రో ఇప్పటివరకు ఆరు తరాల వాహకనౌకలను తయారుచేసింది. ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మార్గదర్శకంలో, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా 1979లో మొదటి వాహకనౌక ఎస్‌ఎల్వీ-3 ఈ1ను తయారుచేసింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము