పంచాయతీ ఎన్నికలపై రేవంత్ ప్రభుత్వం సందిగ్ధం 

పంచాయతీ ఎన్నికలపై రేవంత్ ప్రభుత్వం సందిగ్ధం 
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత త్వరగా ముందుకెళదామనుకుంటే అంత ఆలస్యం అవుతుంది. వాటి కాలపరిమితి తీరి సంవత్సరం అవుతున్నా ఇంకా ఎన్నకలపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని పట్టుదల వ్యక్తం చేసినా ముందడుగు పడటం లేదు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆ ప్రక్రియ మొత్తం మార్చి 8 వరకు కొనసాగుతుంది. ఇక బిసి రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక అందుతుందని, ఆ ప్రకారం నివేదికను హైకోర్టుకు సమర్పించిన అనంతరం నిర్ణయం వెలువడే వరకు మరింత సమయం పడుతుంది. దీంతో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధంలో ఉంది.
 
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలిన తరువాతే జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల సర్వే వివరాల ముసాయిదా మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. అనంతరం పూర్తి నివేదికను క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి ఫిబ్రవరి 2 నాటికి అధికారులు అందజేయనున్నారు.
 
ఆ వెంటనే సబ్‌కమిటీ సమావేశమై నివేదికపై చర్చిస్తుంది. ఆపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి బీసీల రిజర్వేషన్లపె తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. దీనిపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన నాలుగు పథకాలను మార్చి నెలాఖరు వరకు అర్హులైన లబ్దిదారులకు అందజేస్తామని ప్రకటించింది. 
 
మండలంలోని ఒక గ్రామం లెక్కన ప్రస్తుతం ఈ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకారం మార్చి చివరి వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం కనిపించడం లేదు. దీంతో ఈ పరిస్థితిలో పంచాయతీ ఎన్నికల అంశంపై జాప్యం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
కాగా గత ఏడాది ఫిబ్రవరి1న సర్పంచ్‌ల పదవీకాలం ముగియగా ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. రెండు రోజుల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాది పూర్తవుతుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం 27 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం బీసీలకు 23 శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలవుతోంది. 
 
ఇప్పుడు కులసర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం నుంచి ఆమోదం అవసరం. దీంతో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ విజ్ఞప్తిని కేంద్రం అనుమతించకపోతే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.