
2036 సంవత్సరంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులను దక్కించుకునేందుకు భారత్ సర్వశక్తులు ఒడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా భారత్‌లో క్రీడా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వివరాలను వెల్లడించారు.
“ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అన్ని రంగాలు పుంజుకుంటాయి. వాటి వల్ల అథ్లెట్లకు ఉత్తమమైన సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వస్తాయి” అని ప్రధాని చెప్పారు. “దేశంలోని అథ్లెట్లు, క్రీడాకారుల సామర్థ్యాలను పెంచడంపై మేం ఫోకస్ పెట్టాం. తప్పకుండా వారందరికీ దన్నుగా నిలుస్తాం. దేశ వికాసానికి దోహదపడే కీలకమైన విభాగంగా మేం క్రీడలను పరిగణిస్తున్నాం” అని మోదీ పేర్కొన్నారు.
“ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావనను బలోపేతం చేసే గొప్ప మాధ్యమం క్రీడలు” అని ఆయన తెలిపారు. 2023 సంవత్సరంలో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సమావేశంలోనే 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ ఆసక్తిని వ్యక్తం చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చేసిన ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నమోదు చేసుకుంది. ఆతిథ్య దేశం ఎంపికపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్