ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది

ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. బుధవారం ఘోండా నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని చెప్పారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్‌ సర్కారు పోయి, బీజేపీ సర్కారు వస్తుందని జోస్యం చెప్పారు. ఈ మాట తాను మాత్రమే చెప్పడం లేదని యావత్‌ ఢిల్లీ ప్రజలంతా అదే అంటున్నారని పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రజలు ఇంటింటికి నల్లా నీళ్లు కావాలని, ట్యాంకర్‌ మాఫియా నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారని ప్రధాని చెప్పారు. గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ వారి ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఆప్‌ అబద్ధపు హామీలను ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 

ఢిల్లీ ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సభకు హాజరైన జన సంఖ్యే చెబుతోందని ఆయన అన్నారు. ఢిల్లీ బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రధాని మెచ్చుకున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేలా మ్యానిఫెస్టో ఉన్నదని తెలిపారు.  21వ శతాబ్దంలో ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు, ఆప్‌ 11 ఏళ్లు పాలించాయని, అయినా ఢిల్లీ ప్రజల బతుకుల్లో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదని ప్రధాని మోదీ విమర్శించారు. 

నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు, పేలవమైన మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, కాలుష్యం, మురుగునీరు తదితర సమస్యలు ఢిల్లీ ప్రజలను వేధిస్తున్నాయని ధ్వజమెత్తారు.  యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందని ప్రధాని మండిపడ్డారు.  ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ “విషం” కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మోదీ మండిపడ్డారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా? అని ప్రశ్నించారు.

”యమున పేరుతో ఓట్లడిగారు. ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీని నీళ్లు అడుక్కునేలా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాపాలకు పాల్పడుతున్నారు. చరిత్ర ఎన్నటికీ వాళ్లను క్షమించదు. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు. బీజేపీ మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది” అని మోదీ స్పష్టం చేశారు.

ఆప్ ప్రభుత్వం చేసిన నిందారోపణలను హర్యానా ప్రభుత్వం మరిచిపోదని ప్రధాని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఆప్ నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా? అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తుంది? ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారు.. అని మోదీ పేర్కొన్నారు.

కాగా దాదాపు 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ  ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నది. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారం తమదేనని ఆప్‌ కూడా ధీమాతో ఉంది.