128 మున్సిపాలిటీల్లో ‘ప్రత్యేక’ పాలన ప్రారంభం

128 మున్సిపాలిటీల్లో ‘ప్రత్యేక’ పాలన ప్రారంభం
తెలంగాణలోని 128 మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల గడువు ముగిసింది. దీంతో సోమవారం నుంచి ఆ పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆదివారం మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్‌ జీవో 15 విడుదల చేశారు. నస్పూర్‌, కొత్తపల్లి మంచిర్యాల మున్సిపాలిటీలు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనమైనందున 128 మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన అమల్లోకి తెస్తున్నట్టు స్పష్టం చేశారు. 
 
ఈ నెల 28 నుంచి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడా ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ప్రత్యేక అధికారుల పాలన అమలయ్యే పురపాలికల్లో అభివృద్ధి కుంటుపడి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయే అవకాశం ఉన్నది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 139 మున్సిపాలిటీలు, 16 మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 7 మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. కనీసం మున్సిపల్‌ పట్టణాల వారీగా ఓటర్ల జా బితా సిద్ధంగా లేదు. మున్సిపల్‌ ఎన్నికలపై రేవంత్‌రెడ్డి సర్కారు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. 
 
అదేవిధంగా, గ్రామ పంచాయతీల పాలకమండళ్ల కాలపరిమితి గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసినా ఇప్పటివరకూ వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  డెడికేషన్‌ కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాతే 42% బీసీ రిజర్వేషన్ల విధానంపై స్పష్టత వస్తుంది. 
 
డెడికేషన్‌ కమిటీ నివేదిక సానుకూలంగా వచ్చినప్పటికీ, మొత్తం రిజర్వేషన్లు గరిష్ఠంగా 50 శాతానికి మించకూడదన్న నిబంధన కూడా ఉన్నదని రాజ్యాంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. దానిని అధిగమించాలంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఈ తతంగం మొత్తం పూర్తిచేసుకుని, ఎన్నికలు నిర్వహించాలనుకుంటే మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  లేదంటే పాత విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే, బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉన్నదని భావిస్తున్నారు.
 
అయితే, మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణను మార్చి నెలాఖరు వరకు పూర్తి చేసి, కొత్త పాలకమండలి కొలువుతీరే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో ముచ్చటించినట్టు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రేవంత్‌ సర్కారుకు సవాలుగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.