జగన్ కేసులు రోజువారీ విచారణ.. సుప్రీం ఆదేశం

జగన్ కేసులు రోజువారీ విచారణ.. సుప్రీం ఆదేశం
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ను కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 
 
అలాగే జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది.  ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు. 
 
ఈ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ సరిగా జరగడం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం, శుక్ర,శనివారాల్లో మాత్రమే ఈ కేసుపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా విచారణ చేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. 

దీంతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం చేయడంతో తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. జగన్ బెయిల్ రద్దుకు కారణాలు ఏమీ లేవని ఆ కేసుల్ని తమకు పర్యవేక్షించమంటారా? అంటూ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది.

అయితే తాము హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు లాయర్ కోరగా, ధర్మాసనం అంగీకరించింది. దీంతో రఘురామ వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

కాగా, ఈరోజు రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపారు. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ట్రయల్ కోర్టు రోజు వారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని  ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఈ క్రమంలోనే జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఉన్నత న్యాయం స్థానం కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కొంతమేరకు ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో గత 12 ఏళ్లుగా విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని, ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌ కూడా డిస్పోజ్‌ చేయలేదని రఘురామ తరఫు లాయర్ వాదనలు వినిపించారు.

సుప్రీంకోర్టు గతంలోనే కేసుల బదిలీ సాధ్యం కాదని చెప్పిందని, కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసుల్ని పర్యవేక్షించాలని కోరుతున్నామన్నారు.  సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. ఈ కేసుల్ని హైకోర్టు మానిటర్‌ చేస్తోందని, ఇంకా కేసులు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తరఫు లాయర్ వాదించారు. ఈ వాదన్ని విన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.