
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో కొత్త లేబర్ కోడ్ నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త లేబర్ కోడ్ మూడు దశల్లో అమల్లోకి రానుంది.
దీంతో వేతన జీవులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి నాలుగు రోజుల పని దినాలు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్ వాటా పెరిగితే ప్రతి నెలా వచ్చే వేతనం తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో అమలు చేస్తారని సమాచారం.
2025-26 ఆర్ధిక సంవతర్సం బడ్జెట్లోనే ఈ కోడ్లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం అమల్లోకి వస్తుంది. ఇవి అటు యాజమాన్యాలకు అనువుగానూ, ఇటు ఉద్యోగులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేలా ఉంటాయని భావిస్తున్నారు. తొలిదశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఈ కోడ్లను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మధ్యస్థ సంస్థలు, మూడో దశలో 100లోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలకు తప్పనిసరి చేయనున్నారు. కొత్త కార్మిక విధానం ప్రకారం ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు దాదాపు రెండేళ్లు సమయం పడుతుంది. భారత వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా చిన్న పరిశ్రమలదే కావడం గమనార్హం.
కొత్త లేబర్ కోడ్ అమలుకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ చట్టాలపై కేంద్రంతో పాటు రాష్ట్రాలకు నియనిబంధనలు రూపొందించే అధికారం ఉంటుంది.
పశ్చిమ్ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో కార్మిక శాఖ తలమునకలై ఉంది. వాస్తవానికి మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా వంటివి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.
ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్ ఈ నాలుగు కొత్త కోడ్లు. ఇవి అమల్లోకి వస్తే వారంలో నాలుగు రోజుల పని విధానం ఉండే అవకాశాలు ఉణ్నాయి. ఉద్యోగుల పని, వేతన మధ్య సమతౌల్యతను ఏర్పరచడమే దీని ప్రధాన ఉద్దేశం.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం