
రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా సంస్కృతి ఫౌండేషన్ కు తెలంగాణ గవర్నర్ అవార్డును బహుకరించారు. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుండి సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి ఉమామహేశ్వరరావు ఆదివారం స్వీకరించారు.
కళాశాల స్థాయి సాంస్కృతిక నాయకత్వ కేంద్రాలు (కల్చరల్ లీడర్ షిప్ సెంటర్లు) తో బాటు ప్రభుత్వ విధానాలు, వాటిపై సాంస్కృతిక వారసత్వ ప్రభావాలపై పరిశోధనల ద్వారా నలుగురికీ పనికి వచ్చే పనులు చేస్తూ మంచి అలవాట్లు ఉండేలా ప్రోత్సహించే విధంగా కళాశాలల్లో సాంస్కృతిక నాయకత్వ కేంద్రాలను నెలకొల్పి , అక్కడి యువతని ప్రోత్సహిస్తు న్నందుకు సంస్కృతి ఫౌండేషన్ కు గవర్నర్ ఈ అవార్డును అందజేశారు.
సంస్కృతి ఫౌండేషన్ ను 2009 లో స్థాపించారు. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి అంకితమైన రిజిస్టర్డ్ ట్రస్ట్. ప్రభుత్వ విధానం అంశాలపై జాతీయ వనరుల కేంద్రం (నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ కల్చర్) గా మారాలనేది దీని లక్ష్యం కాగా, పరిశోధన, విద్య, సంభాషణల ద్వారా భారతీయ సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.
మేధావులను ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంశాలపై పాల్గొనేలా చేయడం ద్వారా, వైవిధ్యమైన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా, ఫౌండేషన్ భారతీయ విలువలు, సంప్రదాయాలను నిలబెట్టే వ్యక్తులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫౌండేషన్ తన లక్ష్యాలను చేరుకోవడానికి సాంస్కృతిక నాయకత్వ కేంద్రాల ద్వారా యువతపై, సంస్కృతి అధ్యాయ కేంద్రం ద్వారా మేధావులపై దృష్టి పెడుతుంది.
సంస్కృతి ఫౌండేషన్ కార్యక్రమాలు సంప్రదాయ విలువలను సమకాలీన సమాజ అవసరాలతో సమర్ధవంతంగా మిళితం చేస్తాయి. ఈ కార్యక్రమంలో సంస్కృతి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డి ఆర్ ఎస్ పి రాజు, కన్వీనర్, డా. డబ్ల్యు జి ప్రసన్న కుమార్, డైరెక్టర్ ఎన్ నాగ ప్రశాంతి కూడా పాల్గొన్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి