కామన్వెల్త్‌ దేశాలతో భారత్‌లోనే క్యాన్సర్‌ ఉనికి

కామన్వెల్త్‌ దేశాలతో భారత్‌లోనే క్యాన్సర్‌ ఉనికి
కామన్వెల్త్‌లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే క్యాన్సర్‌ ఉనికి అధికంగా ఉంది. 2008- 2018 మధ్య కాలంలో దేశంలో క్యాన్సర్‌ నిర్ధారణ అయిన రోగుల సంఖ్య 35 శాతం పెరిగింది. భారత్‌లో ప్రతి తొమ్మిది మందిలోనూ ఒకరు తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.  ఉపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లు సర్వసాధారణమై పోయాయి. ఇక్కడ ఆందోళన కలిగించే ముఖ్య విషయమేమంటే భారత్‌లో క్యాన్సర్‌ కేసుల సంఖ్య అంతర్జాతీయ సగటును కూడా దాటిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయని లాన్సెట్‌ అంకాలజీలో ఇటీవల ప్రచురితమైన ఓ పత్రం తెలిపింది. 
 
2020లో దేశంలో 1.39 మిలియన్లుగా ఉన్న క్యాన్సర్‌ రోగుల సంఖ్య 2024 చివరి నాటికి 1.57 మిలియన్లకు చేరుకుంటుందని పత్రం సహ రచయిత డాక్టర్‌ భావనా సిరోహీ తెలిపారు. మన దేశంలో క్యాన్సర్‌ కేసుల్లో సుమారు 40 శాతం వరకూ పొగాకు వినియోగం కారణంగా నమోదవుతున్నవే.  పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.
ఆహారం సరిగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల 10 శాతం కేసులు నమోదవుతాయని డాక్టర్‌ భావనా సిరోహీ చెప్పారు. ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయపూర్‌లో వేదాంత మెడికల్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ వైద్య డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. యాభై ఆరు కామన్వెల్త్‌ దేశాల్లో క్యాన్సర్‌ మహమ్మారి ఉనికి కన్పిస్తోందని, 2008-2018 మధ్యకాలంలో ఈ దేశాల్లో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య 35 శాతం పెరిగిందని కామన్వెల్త్‌లోని లాన్సెట్‌ అంకాలజీ కమిషన్‌లో ప్రచురితమైన పత్రం తెలియజేస్తూ ఇది ఆందోళన కలిగించే పరిణామమని చెప్పింది. 
 
ఆస్ట్రేలియా, కెనడా వంటి పెద్ద దేశాల్లోనూ, భారత్‌ వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లోనూ, బార్బడాస్‌, బ్రూనై వంటి చిన్న దేశాల్లోనూ క్యాన్సర్‌ ఉనికి అధికంగా ఉందని, ఈ మహమ్మారిపై పోరాడేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆ పత్రం సూచించింది.