
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇండ్లకు ‘ఇందిరమ్మ’ పేరు పేడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ బియ్యంపై ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ఇకపై కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధానమంత్రి కూడా పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
దావోస్ వేదికగా లక్షల కోట్ల రూపాయల పెట్టబడులపై ఎంఓయూలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారమంతా హంబక్ అని కొట్టిపారేశారు. గత పదేళ్లలో రూ. 5 లక్షల కోట్లకుపైగా పెట్టబడులు రాబోతున్నాయని అవగాహన ఒప్పందాలు చేసుకున్నారని, ఆచరణలో మాత్రం పదో వంతు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 2014 నుండి నేటి వరకు దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంఓయూలు జరిగాయి? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారు? ఆచరణలో ఎన్ని పెట్టబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని సవాల్ విసిరారు.
కరీంనగర్ లో మేయర్ సునీల్ రావుతోపాటు ఇద్దరు కార్పొరేటర్లు, వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరారు. వారందరినీ బీజేపీలో సాదరంగా ఆహ్వానిస్తూ బండి సంజయ్ కాషాయ కండువా కప్పారు.
నరేంద్రమోదీ నాయకత్వంపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలు నమ్మి బీజేపీలో చేరుతున్న కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవిలకు సాదర స్వాగతం. బీజేపీలో చేరుతామని చాలా మంది వస్తున్నారని, అయితే భూకబ్జాలకు పాల్పడే వారిని బీజేపీలో చేర్చుకోబోం అని స్పష్టం చేశారు. కరీంనగర్ అభివ్రుద్ధికి నిధులు తెచ్చిందెవరో నిన్నటి కేంద్ర మంత్రి రాకతో ప్రజలకు తేటతెల్లమైందని చెబుతూ ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదే అని భరోసా వ్యక్తం చేశారు.
కేంద్రం నుండి నిధులు తెచ్చినా గత 10 ఏళ్లుగా ఏనాడూ బీఆర్ఎస్ తనను పిలవలేదని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ పైసలు కూడా తానే కొట్లాడి తెస్తే తనను పిలవకుండా బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయాయని పేర్కొంటూ బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత