
కరీంగనర్‌లో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడక్కడ తోసుకున్నారు. ఓ గన్‌మన్ మంత్రి పొంగులేటిపై పదే పదే పడడంతో ఆగ్రహించిన పొంగులేటి ‘వాట్ ఆర్‌యూ డూయింగ్.. కామన్ సెన్స్ ఉండదా? ఏమిటిది ఒక పద్ధతి లేదు.. పాడు లేదు.. ఎస్పీ (సీపీ) ఎక్కడ?’ అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్నా మంత్రి అసంతృప్తి, ఆగ్రహంతో మాట్లాడిన మాటలు ఆమెను బాధించాయని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. మంత్రి మాటలు ఉద్యోగుల్లో సహితం కలకలంరేపాయి. శనివారం కరీంనగర్ కలెక్టరేట్‌లోని ప్రతీ కార్యాలయంలోనూ ఇదే చర్చ జరిగింది. ఒక మహిళా కలెక్టర్‌పై మంత్రి అంత ఆగ్రహంగా మాట్లాడడంపై చర్చించుకున్నారు.
పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందన్న భావనతో కలెక్టర్ ఆవేదనకు లోనయ్యారని కలెక్టరేట్ సిబ్బంది చెబుతున్నారు. శుక్రవారం ఘటన మేడంను తీవ్రంగా బాధించి ఉంటుందని, రోజంతా ఆమె ముభావంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ విషయంపై వివిధ రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నేను మహిళను. సందర్భానికి తగినట్టు ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరిగిపోగలను’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారు. ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పలు మీడియాలోనూ వార్తగా వచ్చింది. ఈ పోస్ట్ కొద్ది గంటల్లో మళ్లీ కలెక్టర్ ఇన్‌స్టా ఖాతాలో కనిపించలేదు. ఉన్నతాధికారులు ఎవరైనా జోక్యం చేసుకుని ఆమెను శాంతిపచేస్తూ, ఆ పోస్టును తొలగింప చేశారా? అనే అనుమానం కలుగుతుంది. కాగా, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై సీఎంవో చర్యలు తీసుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్