ఢిల్లీలో బిజెపి మూడో మ్యానిఫెస్టోని విడుదల

ఢిల్లీలో బిజెపి మూడో మ్యానిఫెస్టోని విడుదల

వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మూడో మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో బిజెపి ఢిల్లీ ప్రజలకు పలు హామీలిచ్చింది. శరణార్థి కాలనీల్లోని ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించడం, దేశ రాజధానిలో 13 వేలు సీల్‌ చేసిన దుకాణాలను తిరిగి తెరవడం వంటి హామీలను బిజెపి ప్రకటించింది. 

మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా మాట్లాడుతూ. ’17 వేలకు పైగా అనధికార కాలనీలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్టు మోదీజీ ప్రకటించారు. గతంలో ఈ కాలనీలకు నిర్మాణం, కొనుగోలు లేదా అమ్మకం కోసం అనుమతి లేదు. ఇప్పుడు ఈ కాలనీల్లో వారికి పూర్తి యాజమాన్య హక్కుల్ని కల్పించడం ద్వారా గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ నిబంధనలు, ఢిల్లీలో చట్టాల ప్రకారం ఆ కాలనీల్లో భవనాలను నిర్మించుకునే హక్కు, వాటిని అమ్ముకునే హక్కుకానీ వారికి లభిస్తుంది’ అని ప్రకటించారు. 

‘ఢిల్లీలో సీల్‌ చేసిన 13 వేల షాపుల్ని తెరిచేందుకు న్యాయపరమైన సలహాలను న్యాయవాదులతో కలిసి చర్చిస్తాము. దీని కోసం ప్రత్యేకంగా జ్యుడిషియల్‌ అథారిటీతో ఈ షాపులను తిరిగి ఆరునెలల్లోపు తెరుస్తాము’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. ఈ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కార్మికులు జీవిత బీమా పొందే అవకాశమున్నట్లు అమిత్‌షా ప్రకటించారు.

కాగా, ఢిల్లీలో నిరుద్యోగ యువత కోసం 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు బిజెపి ప్రకటించింది. వందశాతం ఢిల్లీని ఎలక్ట్రిక్‌ బస్‌ నగరంగా మార్చనుంది. ఆప్‌ హయాంలో యమునా నదిని శుభ్రపరచలేదు. తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రపరుచుతామని బిజెపి తెలిపింది. ఇక మహిళలకు నెలకు 2 వేలు, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నట్లు బిజెపి హామీ ఇచ్చింది.

కాగా, అరవింద్ కేజ్రీవాల్‌ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అమిత్ షా విమర్శించారు. డి ల్లీలో వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయిందని, కాలుష్యాన్ని అరికట్టడంతో కేజ్రీవాల్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి, అర్వింద్‌ కేజ్రీవాల్‌కు బుద్ధి చెప్పాలని, బీజేపీని గెలిపించాలని అమిత్‌ షా ఓటర్లను కోరారు. బీజేపీని గెలిపిస్తే కేవలం మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.