చీనాబ్‌ రైలు వంతెనపై పరుగులు పెట్టిన వందేభారత్‌

చీనాబ్‌ రైలు వంతెనపై పరుగులు పెట్టిన వందేభారత్‌
జమ్ము కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారిగా శనివారం వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ రైల్వే వంతెనపై కశ్మీర్ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారు చేసిన ప్రత్యేకమైన రైలు ప్రయాణించగా, విజ్యువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ తెగ సంబురపడిపోతున్నారు. జీవితంలో ఒక్కసారైన ఆ రైల్లో ప్రయాణించి ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నడుస్తున్న ఇతర 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే కశ్మీర్‌ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్‌ రైలును రూపొందించారు. 
 
నీరు గడ్డ కట్టకుండా ఉండేలా అత్యాధునిక హీటింగ్‌ వ్యవస్థలను ఈ రైలులో ఏర్పాటు చేశారు. ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు ట్రయల్ రన్‌ను భారత రైల్వే శాఖ శనివారం రోజు ప్రారంభించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ వరకు ఈ వందే భారత్‌ రైలు ప్రయాణించింది. మార్గ మధ్యంలో చీనాబ్‌ నదిపై నిర్మించిన భారీ వంతెన మీదుగా వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా కశ్మీర్‌ను భారత్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టుల్లో భాగంగానే ఈ చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిను కట్టారు. అయితే ఈ వంతెన పొడవు మొత్తం 1315 మీటర్లు.
 
గతంలో చైనాలోని బెయిపాన్ 275 మీటర్ల పొడవుతో షుబాయ్ రైల్వే వంతెన నిర్మించారు. ఇదే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ప్రపంచ రికార్డును కల్గి ఉండేది. కానీ జమ్ము కశ్మీర్‌లో నిర్మించిన ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జి మరింత ఎత్తుతో ఉండగా ఆ రికార్డును బద్ధలు కొట్టింది. అంతేకాక ఈ చీనాబ్ వంతెన ఎత్తు పారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే మరింత ఎత్తులో ఉంటుంది. దాదాపు 30 మీటర్లు మరింత పొడవుగా ఉండడం గమనార్హం.